Bride chase: వారిద్దరూ రెండున్నరేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ.. పెళ్లిరోజు పెళ్లికొడుకు (bride groom) పారిపోయాడు. అయితే.. పెళ్లికూతురు (bride) ఏమాత్రం బెదిరిపోలేదు. సినీఫక్కీలో వెంబడించి మరీ పెళ్లికొడుకుని పట్టుకుని మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది. విస్తుగొలిపే ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని బరేలీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
స్థానికంగా నివసించే ఓ యువతీ, యువకుడు రెండున్నరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో బరేలీలోని ఓ శివాలయంలో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే.. ముహూర్తం దాటిపోతున్నా పెళ్లికొడుకు జాడ లేదు. దీంతో అతడికి ఫోన్ చేయగా.. తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్టు చెప్పాడు. పెళ్లికొడుకు మాటలతో అనుమానించి అతడు పారిపోతున్నాడని గ్రహించింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంధువుల సాయంతో అతడ్ని పట్టుకునేందుకు బయలేదేరింది. బరేలీకి 20కి.మీ దూరంలో భీమోరా పోలిస్ స్టేషన్ వద్ద బస్సెక్కి వెళ్లిపోతున్న పెళ్లికొడుకుని వెంబడించి మరీ పట్టుకుంది. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. పెద్దలు కూడా చర్చలు జరిపారు. మొత్తానికి అతడిని పెళ్లిమండపం వద్దకు తీసుకొచ్చి ఇద్దరికీ పెళ్లి జరిపించారు.
