నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగు కాల్వలో దిగి నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా కూడా ఇదే కాల్వలో దిగి నిరసన తెలిపారు. రైల్వే, నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
‘ప్రతిపక్షంలో ఉండగా కూడా ఇదే కాల్వలో దిగి నిరసన తెలిపాను. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారం కోసం నా పంథా మారదు. అధికారులు ఎప్పటిలోపు పనులు ప్రారంభించి.. పూర్తి చేస్తారో రాతపూర్వక హామీ ఇవ్వాలి. అంతవరకూ కాల్వ నుంచి కదిలేది లేదు. గడువు తేదీలోపు వంతెన నిర్మాణం పూర్తి కాకపోతే ఇదే కాల్వలో పడుకుంటాను’ అని అన్నారు.
దీంతో అధికారులు స్పందించి ఈనెల 15లోపు నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తి చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో కోటంరెడ్డి తన నిరసన విరమించారు.