ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు.
అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, చేతివృత్తులు, వృధ్ధులు.. ఇలా రకరకాల వర్గాల వారిగా మనుషులని విభజించాలి. రకరకాల వాగ్ధానాలు చెయ్యాలి, మధ్దతు కూడ గట్టాలి. వీటితోపాటుగా మద్యం, డబ్బు ఎరగా వెయ్యటం లాంటివి అనివార్యం ఏ పార్టీకి అయినా కూడా.
వీటితోపాటు వ్యక్తిగా అభ్యర్థికి వున్న సేవాగుణం, జనంలో వున్న పరపతిని అంచనా వెయ్యలేరు కాబట్టి ధన బలం, కులం బలాన్ని సంఖ్యా రూపంలో కొలవగలరు కాబట్టి ఆ రెండు కోణాల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఒక్కసారి నామినేషన్స్ అయ్యాక ఇది అక్షరాలా నిరూపించగలం. అభ్యర్థి ఆ నియోజకవర్గంలో మొదట ఐదు స్థానాల్లో వున్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినా ఉంటాడు లేదా ఆర్ధికంగా పరిపుష్టమైన వ్యక్తి అయినా అయి వుంటాడు.
గత మూడు ఎన్నికల నుంచి కొత్త పోకడలు వచ్చాయి, కులమే కాకుండా అభ్యర్థి కులాంతర వివాహం అదనపు అర్హతగా మారింది. అభ్యర్థి జీవిత భాగస్వాము వేరు కులం అయితే ఇరువురి కులాలని ప్రతి పార్టీ ప్రకటిస్తుుండడం చూస్తున్నాం.
తెలంగాణలో నాయకులు వాళ్ళ జీవిత భాగస్వాముల కులం ఎలా ప్రచారంలోకి తెచ్చారనేది మరొకసారి ప్రస్తావించుకుందాం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభ్యర్థులను పరిగణించే ప్రక్రియలో భాగంగా ఎస్సీ/ఎస్టీ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతంలో వున్న ఆధిపత్య కులం భర్తగానీ భార్యగానీ ఉండటం అదనపు అర్హత. అలాగే మహిళా బీసీ అభ్యర్ధులని ప్రకటించే ప్రక్రియలో కూడా కనిపించని నాలుగో సింహం రెడ్డో, కమ్మో ఉండటం పరిపాటి. అధికారం అంతా వారిదే- పేరుకి బీసీ/ఎస్సీ/ఎస్టీలు అభ్యర్థులుగా విజయం సాధించినప్పటికినీ.
నందికొట్కూరు ఎమ్మెల్యేగా పనిచేసిన తొగరు ఆర్దర్ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పినది- మీ భార్య రెడ్డి అని తెలిసింది నిన్ను ఎమ్మెల్యేగా పెడితే మీ భార్య కులం అదనపు బలం అని ముఖ్యమంత్రి వైస్సార్ అన్నాడు అని. ఆర్థర్ నిజాయితీ పరుడు, సౌమ్యుడు ఒక జిల్లాకి ఎస్పీగా చేసినవాడు. కానీ, అతని భార్య కులం కూడా పరగణించటం రాజకీయాల్లో కులం ప్రాధాన్యత ఎంత అనేది చెప్పొచ్చు.
అలాగే డాక్టర్ కమ్మెల శ్రీధర్ ఆర్ధికంగా బలవంతుడు, రాజకీయాల పట్ల ఆసక్తి తో.. తెనాలి సొంత నియోజకవర్గం తెనాలిలో పోటీచేసే అవకాశం ఇవ్వమన్నప్పుడు మీభార్య ఎస్సీ అని తెలిసింది పైగా డాక్టరు, తాడికొండ ఇస్తాము, అక్కడ మీ సామాజిక వర్గం కూడా చెప్పుకోతగిన సంఖ్యలో వున్నది అది అదనపుబలం అని.. మా ఆర్ధిక స్థితిగతులు బ్యాంకు బాలన్సులు హాస్పిటల్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చారు అని ఇంటర్వ్యూలో చెపుతున్నాడు.
చీరాలలో కూడా చేనేత సామాజిక వర్గానికి చెందిన సునీతకి ఆమె భర్త పోతుల సురేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం ప్రధాన కారణం. దానికి విస్తృతమైన ప్రచారం కూడా జరిగింది.
అలాగే, మంత్రి రోజా రెడ్డి కులస్తురాలు అయినా నగరిలో ఇవ్వటానికి ఆమె భర్త సినీ దర్శకుడు సెల్వమణికి చెందిన ముదిలియార్ వర్గానికి ముప్ఫయ్ వేలు ఓట్లు ఉండటం, అలాగే రోజా భర్త ఆ ముదిలియార్ కులస్తుడు అని ప్రకటించటం.
కులం ఎక్కడకీ పోదు ఇంకా ఇంకా బలపడుతుంది, రాజకీయాలకి కులాంతర వివాహాలు కూడా మరింత అక్కరకు వస్తున్నాయి
మీడియాలో ఎదో ఒక సందర్భంలో లేదా స్వయంగా అభ్యర్థి మరియు రాజకీయ పార్టీలు ప్రకటించిన వివరాలు:
1) నెల్లిమర్లలో ఎమ్మల్యేగా పోటీలో వున్న లోకం మాధవి భర్త కాపు వ్యక్తి.
2) పాయకరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత భర్త కాపు వ్యక్తి
3) రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో వున్న నాగులాపల్లి ధనలక్ష్మి భర్త అనంతబాబు ఎమ్మెల్సీ కాపు. ఇతను కూడా జనరల్‌లో ఉంటే పడమటి కాపుగా, బీసీ రిజర్వు అయితే తూర్పు కాపుగా, ST రిజర్వు అయితే కొండకాపుగా ఎంపీపీ/జడ్పీటీసీ ఎన్నికల్లో వాడాడు అని మీడియాలోనే చూస్తున్నాం.
4) గుంటూరు WEST నుంచి ఎమ్మేల్యేగా పోటీలో వున్న మంత్రి విడదల రజని భర్త కాపు
5) P.గన్నవరం ఎమ్మల్యేగా పోటీలో వున్న విప్పర్తి వేణుగోపాల్ భార్య కాపు కులస్థురాలు
6) అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ భార్య కమ్మవారు, అతనికి ఆమె సామాజికవర్గం సోపానంలా ఉపయోగపడింది అంటారు.
7) ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ భార్య కమ్మవారు.
8) ప్రస్తుత ఎమ్మల్యే సింహాద్రి చంద్రశేఖర్ భార్య కమ్మవారు.
9) విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో వున్న బోండా ఉమామహేశ్వరావు భార్య కమ్మ వారు.
10) అరకు ఎంపీగాపోటీ చేస్తున్న కొత్తపల్లి గీత భర్త కమ్మ వ్యక్తి.
11) పలాస నుంచి ఎమ్మెల్యే గా పోటీలో వున్న గౌతు శిరీష భర్త కమ్మవారు.
12) తుని నుంచి ఎమ్మెల్యే గా పోటీలో వున్న యనమల దివ్య భర్త కమ్మవారు.
13) గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే గా పోటీలో వున్న పిడుగురాళ్ల శిరీష భర్త కమ్మవారు.
14) నగిరి నుంచి ఎమ్మెల్యే గా పోటీలో వున్న మంత్రి రోజా భర్త ముదలియారు.
15) అమలాపురం ఎమ్మల్యేగా పోటీలో వున్న మంత్రి పినిపే విశ్వరూప్ భార్య రెడ్డి కులస్థురాలు. ఇతను ఇంకో అడుగు ముందుకేసి కొడుకు పేరులో రెడ్డి అని పెట్టాడు. అంత ఆత్మ నూన్యతా భావం ఎందుకో? అతని కొడుకు ఏగ్రామానికి రెడ్డో.?
ఇలానే ఈటల రాజేంద్ర తెలంగాణ మాజీ మంత్రి అతని భార్య రెడ్డి కులస్థురాలు అతని కొడుక్కు పేరులోరెడ్డి తగిలించారు.
16) ఏలూరు ఎంపీగా పోటీలో వున్న కారుమూరి సునీల్ భార్య రెడ్డి కులస్తురాలు.
17) గుడివాడ ఎమ్మెల్యేగా పోటీలో వున్న వెనిగళ్ల రాము భార్య ఎస్సీ మాదిగ, వృత్తి డాక్టర్.
18) పెనుగొండ నుచి పోటీలో వున్న మంత్రి ఉషశ్రీ భర్త రెడ్డి.
19) చంద్రగిరి నుంచి పోటీలో వున్న పులివర్తి నాని భార్య కూడా రెడ్డి కులస్తురాలు.
20) హిందుపూర్‌లో పోటీ చేస్తున్న దీపిక కురుబ కులస్థురాలు. భర్త రెడ్డి కులస్థుడు అని ప్రకటించారు.
21) మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామీ, మాజీ ఎమ్మల్యే తిప్పేస్వామి, మాజీ ఎంపీ శివప్రసాద్, పొగరు ఆర్థర్ వీరి అందరి భార్యలు రెడ్డి కులస్తులు అవ్వటం రాజకీయం ఎవరి చేతిలో ఉందో అర్ధం అవుతుంది.
సింగనమల ఎమ్మల్యేగా చేసిన జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డిదే పెత్తనం. ఈ విషయమై, తన టిప్పర్ మీద పనిచేసే ఎర్ర లక్కప్పకి టికెట్ ఇప్పించి పెత్తనం తన చేతిలో నుంచి జారి పోకుండా చూసుకుంటున్నాడని చంద్రబాబు విమర్శించారు. మొన్నటివరకు భార్య రూపంలో పెత్తనం చేసావు, ఇప్పుడు నీ టిప్పర్ డ్రైవర్ని పెట్టావు పోటీలోకి అని.. దాన్ని వక్రీకరించి నువ్వు టిప్పర్ డ్రైవర్‌ని అవమానించావు అని రెడ్డి రాజకీయం చేస్తున్నారు.
రాజకీయం, కులం.. ఈ రెండిటికీ విడదీయరాని సంబంధం వుంది. కుల ప్రస్తావన లేకుండా రాజకీయం లేదు. ఆ కుల జాడ్యంతోనే రాజకీయం నిండిపోయింది.! మతాలు మారిపోయినా, కులాల ప్రస్తావనతోనే రాజకీయం చేస్తుండడం ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఎక్కువగా చూస్తున్నాం.! ఒక్కమాటలో చెప్పాలంటే, కుల జాడ్యం అనే మురికిలో నిండా మునిగిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయం.