తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా ఆమె సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన విషయం తెల్సిందే. ప్రస్తుతం యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా తమిళ రాజకీయాల్లో ఉన్నారు. ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ చాలా కాలం పాటు ప్రచారం జరిగింది. కాని అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరం అయ్యాడు.
ఇప్పుడు మరో సూపర్ స్టార్ విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సుదీర్ఘ కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇప్పటే పలు సార్లు తాను రాజకీయాలకు దూరం అంటూ చెబుతూ వచ్చాడు. కాని ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరుగబోతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన అభిమానులకు విజయ్ అనుమతించాడు. అభిమాన సంఘం తరపున విజయ్ ఫొటోను పెట్టుకుని అభిమానులు ఇండిపెండెంట్స్ గా పోటీ చేసేందుకు ఓకే చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ అభిమానులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే తప్పకుండా ముందు ముందు విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశం ఉందంటున్నారు.