దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. జ్ఞానవాపిలో ఏముంది.? మసీదులో శివాలయం వుందా.? శివాలయాన్ని కూల్చేసి మసీదు కట్టబడిందా.? అసలేంటి కథ.? ఇటు సోషల్ మీడియాలో, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇంకో పక్క డిజిటల్ మీడియాలో.. ఎక్కడ చూసినా ఇదే అంశం గురించిన చర్చ జరుగుతోంది.
తెలంగాణలో జోగులాంబ దేవాలయం వుంది. శక్తి పీఠమది. ఆ దేవాలయానికి వెళ్ళినవారికి అక్కడే ఓ మసీదు కనిపిస్తుంది. ఆ మసీదు ప్రాంగణంలో ఓ దేవాలయం వుంటుంది. దేవాలయం చుట్టూ మసీదు వచ్చిందా.? మసీదులోకి దేవాలయం వచ్చిందా.?
ఎక్కడో ఉత్తర భారతదేశంలోని జ్ఞానవాపి ఘటనకీ, తెలంగాణలోని జోగులాంబ దేవాలయానికీ లింకేంటి.? అంటే, అలా చర్చలు జరుగుతున్నాయ్ మీడియాలో.! భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం తాలూకు గొప్పతనం. దురదృష్టమేంటంటే, ఆ భిన్నత్వం చుట్టూనే రాజకీయాలు నడుస్తుంటాయి. ఏకత్వం దిశగా ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో పని చేయదు.
చాలా రాజకీయ పార్టీలకు ‘మతం’ ఓ ఆయుధం. ఎన్నికల వేళ ఓట్లను కొల్లగొట్టేందుకు ఇంతకన్నా శక్తివంతమైన ఆయుధం ఇంకేమీ వుండదు. అంతేనా, కులం పేరుతోనూ, ప్రాంతం పేరుతో కూడా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయగలవ్.. చేస్తున్నాయి కూడా.
జ్ఞానవాపి కొత్త ఉదంతం కాదు. జోగులాంబ దేవాలయం గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దర్గాల చుట్టూ హిందువులు ప్రదక్షిణలు చేస్తారు.. వినాయక నిమజ్జనం వంటి సమయాల్లో హిందువులకు, ముస్లింలు సాయం చేస్తారు. ఆ మాటకొస్తే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని తమ ఇంటి అల్లుడిగా ముస్లింలు భావిస్తారు.
వివాదానికి తావు లేని చోట వివాదాన్ని వెలికి తీయడమే రాజకీయం. రెండేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి వుంది. ముందస్తు ఎన్నికలంటూ హంగామా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ జ్ఞానవాపి, ఇక్కడ జోగులాంబ వ్యవహారం. ఎప్పుడో జరిగిన దండయాత్రల ఫలితం.. హిందూ దేవాలయాల విధ్వంసం.
గతం గతః ఇప్పుడు ఆనాటి విధ్వంసాన్ని గుర్తు చేసుకుని.. లేదా, కొత్త వివాదాలు రాజేసుకుని.. ప్రస్తుత సమాజాన్ని విధ్వంసానికి గురిచేద్దామా.?