Driverless Train: లోకో పైలెట్ల నిర్లక్ష్యంతో వారు లేకుండానే ఓ గూడ్స్ రైలు (Train) దాదాపు 80కి.మీ ప్రయాణించింది. పంజాబ్ లో జరిగిందీ ఘటన. చివరకు పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇసుక బస్తాలు, కర్రల సాయంతో రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..
చిప్ స్టోన్స్ తో 53 వ్యాగన్లు ఉన్న ఓ గూడ్స్ రైలు జమ్ము కశ్మీర్ నుంచి పంజాబ్ కు బయలుదేరింది. కథువా రైల్వే స్టేషన్లో డ్రైవర్ చేంజ్ ఉండటంతో రైలును ఆపారు. అయితే.. లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండా దిగిపోవడంతో రైలు మెల్లగా కదిలింది. కొద్దిసేపట్లోనే వేగం అందుకుంది.
ఆ ప్రాంతం వాలుగా ఉండటంతో మార్గమధ్యలో రైలు 100కి.మీ వేగంతో సైతం ప్రయాణించినట్టు చెప్తున్నారు. రైలును హోషియార్ పూర్లో నిలపగలిగారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.