కంపెనీని లాభాల బాట పట్టించిన ఉద్యోగులకు చైనాకు చెందిన క్రేన్ల తయారీ కంపెనీ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా 61 మిలియన్ యువాన్లు (దాదాపు రూ.73కోట్లు) బోనస్ గా ప్రకటించింది. నగదు తీసుకెళ్తున్న ఉద్యోగులకు సంబంధించిన వీడియోలు చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. హెనాన్ మైన్ అనే కంపెనీ కరోనా సమయంలో కూడా భారీ లాభాలు ఆర్జించింది. దీనికి కారణమైన ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు నిర్ణయించింది. మొత్తం 30 మంది ఉద్యోగులను గుర్తించి వారికి నగదు అందించింది.
బోనస్ ను చెక్ రూపంలో ఇవ్వకుండా ఓ వేదికపై రూ.73కోట్ల నోట్ల కట్టలు పేర్చింది. అనంతరం.. కంపెనీ ప్రగతిలో అద్భుత పనితీరు కనబరిచిన ముగ్గరు ఉద్యోగులకు ఒకొక్కరికీ ఐదు మిలియన్ యువాన్లు (దాదాపు రూ.6కోట్లు), మిగిలినవారిలో ఒకొక్కరికీ 1మిలియన్ యువాన్లు (దాదాపు రూ.1.20కోట్లు) ఇచ్చింది. ఈ నగదును తీసుకెళ్లేందుకు ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకున్నారు. మాంద్యం భయంతో ఓపక్క టెకీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. చైనా కంపెనీ ఇలా బోనస్ ఇవ్వడం విశేషం.