వైసీపీ నేత, మంత్రి రోజా.. జబర్దస్త్ షో ద్వారా లక్షల్లో సంపాదించారట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. సినిమా హీరోయిన్‌గా బోల్డంత సంపాదించినట్లు కూడా చెప్పుకున్నారామె.! ఔను, నిజమే.. ఒకప్పుడు తెలుగు తెరపై ఆమె స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఇందులో కాదనేదేముంది.?
మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటేమిటి.? ఒక్కో సినిమాకీ 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటారాయన. ఆ మాటకొస్తే, 75 కోట్లు.. ఆ పైన కూడా ఇచ్చే నిర్మాతలున్నారు పవన్ కళ్యాణ్‌కి.
అసలు ఇప్పుడీ చర్చ దేనికి.? రోజా వర్సెస్ పవన్ కళ్యాణ్.. ఎందుకిలా మాట్లాడుకోవాల్సి వస్తోంది.? అంటే, దానికీ బలమైన కారణమే వుంది. ఇటీవల రోజా తన కుమారుడికి అత్యంత ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చారు. ‘బెంజ్’ అనగానే, ఎక్కడో సౌండ్ తేడా కొడుతోంది కదా.? కొడుతుంది మరి.! ఆ మధ్య మంత్రి జయరాం తనయుడి బెంజి కారు వ్యవహారం అప్పట్లో పెను వివాదమయ్యింది.
జయరాం మంత్రి అయ్యాక, ఆయనగారి పుత్ర రత్నానికి బెంజి కారు బహుమతిగా వచ్చిందన్నది అప్పట్లో వినిపించిన ఆరోపణ. ఇప్పుడేమో, రోజాకి మంత్రి పదవి వచ్చాక ఆమె తనయుడికి బెంజి కారు బహుమతిగా వచ్చింది. అద్గదీ అసలు సంగతి. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. ఆ ట్రోలింగ్, రోజాని ఒకింత ఇబ్బంది పెట్టింది.
‘పిల్ల యెదవలు’ అంటూ ప్రధానంగా జనసేన నుంచి తన మీద జరుగుతున్న ట్రోలింగ్ మీద రెచ్చిపోయారు రోజా. సినిమాల ద్వారా, జబర్దస్త్ ద్వారా తాను సంపాదించిన లక్షల ఆర్జన గురించి చెప్పుకున్నారు. నిజమే, రోజా లక్షల్లో సంపాదించారు.. కోట్ల మేర ఆమెకు ఆస్తులు వుండొచ్చు.
మరి, పవన్ కళ్యాణ్‌కి వుండకూడదా.? జనసేన పార్టీ కోసం మొన్నామధ్య కొత్త కార్లు (బెంజ్ స్థాయి కాదు లెండి..) కొనుగోలు చేశారు జనసేనాని. ఆ విషయమై మంత్రి రోజా మాట్లాడుతూ, ‘ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్..’ అంటూ ఎద్దేవా చేశారు. రోజాని విమర్శిస్తే, ‘పిల్ల యెదవలు’ అయినప్పుడు, పవన్ కళ్యాణ్‌ని ‘ప్యాకేజీ స్టార్’ అని విమర్శించిన రోజా ఏమవుతారబ్బా.? అని నెటిజనం.. అందునా జనసైన్యం ప్రశ్నిస్తోంది.
తాను చేస్తే సంసారం.. ఇంకెవరన్నా చేస్తే ఏదో అన్నాడట వెనకటికి ఒకడు. అలా వుంది రోజా వ్యవహారం. లక్షలు సంపాదించే నటి కోట్ల విలువైన కారు కొనొచ్చుగానీ.. కోట్లు సంపాదించే నటుడు లక్షల విలువ చేసే కారు కొనకూడదు.! వారెవ్వా.. రోజా అంటేనే అంతే.! ఆమె మాటకి అర్థం పర్థం వుండదంతే.!