MM Keeravani: సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పొగడ్తలతో ముంచెత్తారు. తనకి ఎవరు అవకాశాలు ఇవ్వని రోజుల్లో తన ప్రతిభను గుర్తించింది ఆర్జీవి మాత్రమేనని గుర్తు చేసుకున్నారు. ఆయన సంగీతం అందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆర్జీవి ‘క్షణక్షణం’ మీ కెరీర్ ను ముందుకు తీసుకెళ్ళిందన్న విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అన్న ప్రశ్నకు కీరవాణి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
‘ మీరు అడిగారు కాబట్టి మీకో విషయం చెప్తున్నా. నేను కంపోజ్ చేసిన ట్యూన్లు పట్టుకొని 51 మంది వద్దకు వెళ్లాను. ఏ ఒక్కరు నన్ను ప్రోత్సహించలేదు. కొంతమందికి ట్యూన్లు నచ్చినా అవకాశం ఇవ్వలేదు. మరి కొంతమంది మొహం చాటేశారు. ఈ దశలో ఆర్జీవి నన్ను నమ్మి ‘క్షణక్షణం’ లో అవకాశం ఇచ్చారు. నేను ఆర్జీవి దగ్గర పనిచేస్తున్నాను అంటే నాలో ఎంతో కొంత ప్రతిభ ఉన్నట్టే అని అప్పుడు నాకు అవకాశాలు క్యూ కట్టాయి. ఆ ఏడాది చాలా సినిమాలకు పని చేశాను. ఆర్జీవి వల్లే నేను ప్రపంచానికి తెలుసు కాబట్టి ఆయనే నా ఫస్ట్ ఆస్కార్. ఇప్పుడు నేను అందుకున్న అకాడమీ అవార్డు రెండోది’ అని ఆర్జీవిని ప్రశంసించారు.
కీరవాణి వ్యాఖ్యలపై ఆర్జీవి స్పందించారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ. ‘ ‘చనిపోయిన వాళ్లకు మాత్రమే ఇలాంటి ప్రశంసలు లభిస్తాయి. కాబట్టి నాకిప్పుడు చనిపోయిన భావన కలుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఆర్జీవి దర్శకత్వం వహించిన ‘క్షణక్షణం’ మ్యూజికల్, కమర్షియల్ హిట్టుగా నిలిచింది. ఇందులో వెంకటేష్, శ్రీదేవి జోడీ ఆకట్టుకుంది. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘జామురాత్రి జాబిలమ్మ’ పాటను ఇప్పటికీ హమ్ చేసుకుంటూనే ఉన్నారు.