లోకేశ్ యువగళం యాత్రలో అస్వస్థతకు గురైన హీరో తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు బెంగళూరు హృదయాలయ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. తారకరత్న ఎక్మో చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని.. ట్రీట్మెంట్ కొనసాగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తారకత్నకు మరికొన్ని రోజులు వైద్యం చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ జరక్కపోవడంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలిపారు. ఈక్రమంలో చంద్రబాబు బెంగళూరు వెళ్లారు. వైద్యులను అడగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణ కూడా ఆసుపత్రి వద్దే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగళూరు వెళ్లనున్నారని తెలుస్తోంది.