Shopping: ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరికి మ్యూజిక్ వినడం ఇష్టం. ఇంకొందరికి వంట చేయడం అంటే ఆసక్తి. మరికొందరికి పెయింటింగ్స్ వేయడం, డాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం ఇలా రకరకాల అలవాట్లు ఉంటాయి.
నిత్యం కొత్తగా కనిపించాలనుకునే వారు షాపింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ కేటగిరీలో మహిళలే ఎక్కువగా ఉంటారు. వారితో షాపింగ్ ది విడదీయలేని అనుబంధం. కొందరు ఆడవాళ్ళైతే తమ స్టేటస్ ని చూపించుకోవడానికి షాపింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. దుబాయ్ కి చెందిన సౌదీ అనే మహిళ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈమె షాపింగ్ ఖర్చు రోజుకి అక్షరాల రూ. లక్షల్లోనే ఉంటుంది.
దుబాయ్ కి చెందిన సంపన్న వ్యాపారవేత్త జమాల్ బిన్ నాడక్ భార్య సౌదీ. ఈమెకి ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సౌదీ రోజూ కాస్ట్లీ వస్తువులతో రీల్స్ చేస్తూ ఉంటుంది. ఖరీదైన డిజైనర్ హ్యాండ్ బ్యాగులు పట్టుకొని ఖరీదైన కార్లలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తన స్టేటస్ చూపిస్తూ ఉంటుంది.
ఇప్పటికే సౌదీ తన భర్త తో కలిసి ప్రపంచ దేశాలు చుట్టేసి వచ్చింది. మొన్నామధ్య ఒక సారి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తన అభిమానులతో ముచ్చటించింది. అందులో తన షాపింగ్ ఖర్చు రోజుకు సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. బట్టలు, మానిక్యూర్, బ్యూటీ పార్లర్ కి రూ.14 నుంచి రూ.15 లక్షలు ఖర్చు పెడతానని చెప్పింది. ఆమె మాటలు విన్న నెటిజెన్లు అవాక్కయ్యారు.