తను నేను, పేపర్ బాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శోభన్ హీరోగా కావ్య తాపర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏక్ మినీ కథ’. యువి క్రియేషన్స్ నిర్మాణంలో, మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు, ప్రభాస్, రామ్ చరణ్ ప్లంటి స్టార్ హీరోల సపోర్ట్ తో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ స్కిప్ చేసి నేడు డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజయ్యింది. మరీ ఈ ఏక్ మినీ కథ ఎంటర్టైన్ చేసిందో లేదో చూద్దాం..
కథ:
సంతోష్ (సంతోష్ శోభన్) కి చిన్నప్పటి నుంచే తన పురుషాంగం చాలా చిన్నదిగా ఉందనే ఆత్మ నూన్యతా భావంతో ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎలా పెంచుకోవాలో తెలియక చాలా బాధ పడుతుంటాడు. అందుకే సంతోష్ పెళ్లి అనే విషయానికి కూడా దూరంగా ఉంటాడు. కానీ అమృత (కావ్య థాపర్) ని చూసాక ప్రేమలో పడడం, తను కూడా సంతోష్ ని ప్రేమించడం, అనుకోకుండా పెళ్లి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోతాయి కానీ అక్కడే సమస్య మొదలవుతుంది. అమృతకి అన్నీ బిగ్ సైజ్ లో ఉండడమంటే ఇష్టం. దాంతో సంతోష్ లో భయం ఇంకా పెరిగిపోతుంది. తన సమస్య చెప్పుకోలేక, ఆ సమస్య పరిష్కరించుకోవడానికి సంతోష్ పడ్డ ఇబ్బందులేమిటి? చివరికి సంతోష్ సమస్యకి పరిష్కారం దొరికిందా? లేక అమృతకి విషయం తెలిసిపోయిందా? తెలిసిపోతే ఎలా రియాక్ట్ అయ్యింది? అనేదే కథ.
తెరమీద స్టార్స్..
ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో సంతోష్ శోభన్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన సినిమా ఇదని చెప్పచ్చు. పురుషాంగం విషయంలో ఆత్మ నూన్యతా భావంతో బాధపడే కుర్రాడి పాత్రలో పలు చోట్ల తన హావభావాలతో నవ్విస్తాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ సూపర్బ్. తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. కావ్య థాపర్ చూడటానికి నాజూగ్గా, సింపుల్ అండ్ స్వీట్ గర్ల్ గా కనిపించడమే కాకుండా, ఉన్నంతలో మంచి నటనని కనబరిచింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో కావ్య థాపర్ అందాల ప్రదర్శన కుర్రకారుకి కనువిందు చేస్తుందనే చెప్పాలి. సంతోష్ – శోభన్ – సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు, వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. శ్రద్ధ దాస్ ది చెప్పుకోదగిన పాత్ర కాదు. బ్రహ్మాజీ, హర్షవర్ధన్ లు తమ పాత్రలకి న్యాయం చేస్తే సప్తగిరి పాత్ర నవ్వించలేకపోయింది.
తెర వెనుక టాలెంట్..
సింపుల్ బడ్జెట్ లో సినిమాని విజువల్ గా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రాఫర్ గోకుల్ భారతి ప్రతి ఫ్రేమ్ ని బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నారు. దానికి తగ్గట్టే ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ కూడా ఉంది. వీరిద్దరి వర్క్ వలన సినిమా చూస్తున్నప్పుడు ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. రవీందర్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సత్య జి ఎడిటింగ్ ఓకే, కానీ స్టోరీ పాయింట్ చాలా చిన్నది అవ్వడం వలన, షార్ట్ గా కాకుండా 2 గంటల 14 నిమిషాల సినిమా కావడంతో బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.
మేర్లపాక గాంధీ ఎంచుకున్న స్టోరీ పాయింట్ చాలా చిన్నది. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పకుండా అనవసరమైన ట్రాక్స్ తో సాగదీయడం వలన కథ పరంగా సెకండాఫ్ చాలా బోర్ కొడుతోంది. మొదటి అర్ధభాగం 45 నిమిషాల వరకూ ఓకే ఇక అక్కడి నుంచీ ఏదో సాగదీస్తున్నట్టే ఉంటుంది. అదీకాక సెకండాఫ్ లో వేసుకున్న కామెడీ ట్రాక్స్ వర్కౌట్ కాకపోవడం వలన బోర్ కొట్టేస్తుంది. సీరియస్ గా తీసుకెళ్లాల్సిన చోట కూడా కామెడీ చేసేయడంతో ఎమోషనల్ ఫీల్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అలాగే స్క్రీన్ ప్లే మరో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పచ్చు. కామెడీ అనుకుంటూ వెళ్లిపోయారు తప్ప కథ ఆసక్తికరంగా వెళ్తోందా అన్న విషయాన్ని మిస్ అయ్యారు. మేర్లపాక గాంధీ రాసిన వన్ లైవ్ డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ రాపోలు నటన రాబట్టుకోవడంలో, కామెడీ సీన్స్ ని కొంతవరకూ డీల్ చేయగలిగాడు కానీ ఓవరాల్ మూవీతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. యువి కాన్సెప్ట్స్ అండ్ మాంగో మాస్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విజిల్ మోమెంట్స్:
– సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్
– సంతోష్ శోభన్ – సుదర్శన్ కామెడీ ట్రాక్
– మొదటి 45 నిమిషాలు
– స్టోరీ లైన్ మరియు మెసేజ్
బోరింగ్ మోమెంట్స్:
– పాయింట్ బాగున్నా బోర్ కొట్టించే పూర్తి కథ
– ఆసక్తిగా సాగని కథనం
– బోరింగ్ సెకండాఫ్
– అంతగా వర్కౌట్ కాని సిల్లీ కామెడీ
– వీక్ క్లైమాక్స్
– బాబోయ్ అనిపించే మూవీ లెంగ్త్
విశ్లేషణ:
‘ఏక్ మినీ కథ’ టైటిల్ అయితే, ‘డస్ సైజ్ మాటర్?’ అనేది టాగ్ లైన్.. అక్కడే తెలుస్తుంది ఇదొక చిన్నపాటి అడల్ట్ కామెడీ మూవీ అని.. అన్నట్టే ఆ అడల్ట్ పాయింట్ తో మొదలెట్టి దానికి కూసింత కామెడీ టచ్ ఇచ్చి సరదాగా యువత అంతా కనెక్ట్ అయ్యేలా సినిమాని ప్రారంభించడంలో టీం సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతే చెప్పిన పాయింట్ నే తిప్పి తిప్పి చెప్పడమే కాకుండా మరీ పాత చితకాయపచ్చడి కామెడీతో, చిత్ర విచిత్రమైన పాత్రలతో కథని ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. దాంతో చూసే ఆడియన్స్ కి బోరింగ్ తో పాటు చివరికి ఇక ముగించేయండి బాబోయ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ‘ఏక్ మినీ కథ’ మొదట్లో ఆకట్టుకొని చివరికి నీరుగార్చేసే లెంగ్తీ కథ.
చూడాలా? వద్దా?: ఓపికతో పాటు ఖాళీగా ఉంటే యువత మాత్రం ట్రై చేయచ్చు.
తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2/5
968638 526023As I site possessor I believe the content material here is rattling excellent , appreciate it for your hard work. You should keep it up forever! Good Luck. 901181