Switch to English

హోమ్ సినిమా సినిమా రివ్యూ: తిప్పరా మీసం

సినిమా రివ్యూ: తిప్పరా మీసం

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి..
నిర్మాత: రిజ్వాన్
దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్
సినిమాటోగ్రఫీ: సిడ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఎడిటర్‌: ధర్మేంద్ర కాకరాల
విడుదల తేదీ: నవంబర్ 8, 2019
రేటింగ్: 1.5

‘మెంటల్ మదిలో’, ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో వసుస విజయాలు అందుకుంటూ తనకంటూ ఓ మార్కెట్ ని క్రియేట్ చేసుకొని వెళ్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. క్లాస్ తో పాటు మాస్ ని కూడా ఆకట్టుకుందామని ‘అసుర’ డైరెక్టర్ కృష్ణ విజయ్ తో కలిసి చేసిన ‘తిప్పరా మీసం’ నేడు విడుదలైంది. ఈ ఏడాది ‘బ్రోచేవారెవరురా’ తో హిట్ అందుకున్న శ్రీ విష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ డ్రామాగా చేసిన ‘తిప్పరా మీసం’ శ్రీవిష్ణుకి మరో హిట్ ఇచ్చిందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

చిన్నప్పుడే డ్రగ్స్ కి అలవాటు పడిన వాడు మన హీరో మణి శంకర్(శ్రీ విష్ణు). తన చేత డ్రగ్స్ మాన్పించాలని రిహాబిలేషన్ సెంటర్లో చేరుస్తారు. కానీ మణి శంకర్ కి అది నచ్చక పారిపోతాడు. అలాగే మదర్ రోహిణి మీద ద్వేషం పెంచుకొని శత్రువులా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మణి శంకర్ పెద్దయ్యాక పబ్బుల్లో డీజేగా పని చేస్తూ డ్రగ్స్ వదిలేసి క్రికెట్ బెట్టింగ్స్ కి అడిక్ట్ అవుతాడు. అలా కాళీకి 30 లక్షల అప్పు పడతాడు. దాన్ని తీర్చడం కోసం మణి శంకర్ పడిన ఇబ్బందులేమిటి.? డబ్బుల కోసం కొత్తగా చేసిన తప్పులేంటి.? ఎందువల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది? అలాగే డబ్బు కోసం సొంత తల్లిని రోడ్ మీదకి లాగి ఎలా టార్చర్ చేసాడు.? ఫైనల్ గా సమస్యల నుంచి బయటపడే క్రమంలో తను మారాడా.? లేక తల్లి రోహిణి మీద అదే పగతో ఉన్నాడా.? అనేదే కథ.

సీటీమార్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

‘తిప్పరా మీసం’ సినిమాలో మనకి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ తల్లి – కొడుకుల మధ్య ఎమోషన్. అలా అని అన్ని పాత సినిమాల్లోలా ఓవర్ మెలోడ్రామాలా కాకుండా ఓ చెడిపోయిన కొడుకు తల్లిని టార్చర్ చేసే యాంగిల్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లో శ్రీ విష్ణు – రోహిణిల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగున్నాయి మరియు ఆ సీన్స్ లో వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా బాగా చేశారు. ఇక శ్రీ విష్ణుని చాలా స్టైలిష్ అండ్ రగ్డ్ లుక్ లో చూపించడం బాగుంది, అలాగే పెర్ఫార్మన్స్ పరంగా ఇరగదీశాడు అని చెప్పుకునేలా లేకపోయినా డీసెంట్ అని చెప్పచ్చు. హీరో మామయ్య పాత్రలో బెనర్జీ బాగానే చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సీన్స్ పరంగా చూసుకుంటే ప్రీ ఇంటర్వల్ ఎపిసోడ్, సెకండాఫ్ లో వచ్చే మదర్ అండ్ సన్ సీన్స్ మరియు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్స్ ఓకే అనిపిస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

టెక్నికల్ పరంగా చూస్తే టోటల్ క్రెడిట్ మనం మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలికి ఇవ్వాలి. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హార్ట్ లాగా నిలిచింది. సీన్స్ లో అంత లేకపోయినా తన మ్యూజిక్ తో చాలా సార్లు మనకు సూపర్బ్ సీన్ ఇది అనిపించేలా చేసాడు. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అదరగొట్టారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సిడ్ సినిమాటోగ్రఫీ.. సినిమా మొత్తం కాకపోయినా చాలా చోట్ల డిఫరెంట్ ఫ్రేమింగ్, డిఫరెంట్ షాట్స్ తీసి విజువల్ గా అట్రాక్ట్ చేసాడు. ముఖ్యంగా డ్రగ్స్ ఎఫెక్ట్ సీన్స్, పబ్ షాట్స్ మరియు అండర్ వాటర్ సీక్వెన్స్ లో తన వర్క్ సూపర్బ్ అనిపిస్తుంది.

ఇక కథా పరంగా బాలేకపోయిన కథ కోసం తీసుకున్న మదర్ అండ్ సన్ ఎమోషనల్ పాయింట్ చాలా బాగుంది. దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా చెప్పారనేది నెగటివ్స్ లో డిస్కస్ చేద్దాం.

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

తెరమీద పాత్రల పరంగా చూసుకుంటే, శ్రీ విష్ణు పాత్ర డిజైనింగ్ అర్జున్ రెడ్డి పాత్రకి దగ్గరగా అంటుంది. కానీ ఇక్కడ కథకి అవసరం లేని ఆవేశపు సన్నివేశాలే కనపడతాయి తప్ప కంటెంట్ కి అవసరమైనవే అనిపించేలా ఏవీ ఉండవు. హీరో పాత్ర మదర్ మీద ద్వేషం పెంచేసుకోవాల్సిన పాయింట్ కూడా సిల్లీగా అనిపిస్తుందే తప్ప ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా లేదు. సో హీరో పాత్రకి పెద్దగా కనెక్ట్ అవ్వము, హీరోకి కనెక్ట్ కాకపోతే సినిమాకి కూడా పెద్దగా కనెక్ట్ కాము కదా… హీరోయిన్ నిక్కీ తంబోలికి ఈ సినిమా వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. అంత గొప్ప పాత్ర కాదు, అలాగే వారి లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, సో సినిమా పూర్తయ్యి బయటకి వచ్చే టైంకి తను ఉందని కూడా మర్చిపోతాం.

సినిమా పరంగా చూసుకుంటే సుమారు ఒక గంట 15 నిమిషాలపైన ఉన్న ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కథలోకి వెళ్లకుండా కేవలం హీరో ఎస్టాబ్లిష్ మెంట్ కే వాడుకున్నారు. సరే హీరో పాత్రలో అన్ని షేడ్స్ ఉన్నాయనుకుందామంటే అదీ లేదు. ఈ విషయంలో డైరెక్టర్ చాలా పూర్ అనిపించుకున్నాడు. అలా అని సెకండాఫ్ ఏదో అద్భుతం అనుకునేరు.. అదీ అంతే కనీసం ఉన్న కథని రివీల్ చేస్తూ రావడం వలన పోన్లే డైరెక్టర్ ఓ కథ అనుకున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. కమర్షియల్ ఫార్మాట్ లో తీస్తున్నప్పుడు లవ్ ట్రాక్ మరియు ఎంటర్టైన్మెంట్ లేదా కనీసం హుక్ చేసే ఎలిమెంట్స్ అన్నా ఉండాలి కానీ ఈ మాస్ బొమ్మలో ఆన్ స్క్రీన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏమీ లేవు.

ఆఫ్ స్క్రీన్:

డైరెక్టర్ గా కథ రాయాలి అని ఫిక్స్, అయినప్పుడు పేపర్ మీద రాసుకున్న మదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుంది కానీ దాన్ని పూర్తి కథగా రాసే క్రమంలో ఎమోషన్ లో అంత ఇంపాక్ట్ కనిపించలేదు. అలాగే స్క్రీన్ మీద చాలా డల్ ఫీలింగ్ వచ్చేలా తీసాడు. ఓవరాల్ గా కాస్తో కూస్తో బెటర్ అనిపించినప్పటికీ ది బెస్ట్ అనేలా ఆ సీన్స్ తీయలేదు. ఇక ఓవరాల్ కథ పరంగా చూసుకుంటే.. అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ అనుకుంటా, అగ్రెసివ్ లవ్ స్టోరీని కాస్తా ఇక్కడ అగ్రెసివ్ మదర్ సెటిమెంట్ కథగా మార్చే ప్రయత్నం చేసి దెబ్బ తిన్నాడు. ఇక కథనం విషయంలోకి వస్తే పరమ బోరింగ్ వే లో వెళ్లారని చెప్పాలి. కొన్ని చోట్ల వాడిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి ఇంకా చిరాకు తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథ చెప్పకపోయినా కనీసం సెకండాఫ్ మీద ఆసక్తి పెంచేలా అన్నా రాసుకోవాలి కదా, యాక్షన్ రివెంజ్ డ్రామాలో ఫాలో అవ్వాల్సిన ఆ బేసిక్ లాజిక్ ని కూడా ఫాలో అవ్వలేదు.

ఇక పోతే డైరెక్టర్ గా రాసుకున్న ఏ విషయాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా ఫెయిల్ అయినా డైరెక్టర్ కొన్ని సీన్స్ చాలా బాగా తీసాడు అని చెప్పుకునే సందర్భాలు చాలా ఉంటాయి కానీ కృష్ణ విజయ్ విషయంలో అలా ది బెస్ట్ అని చెప్పుకునే సీన్ ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరం. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కి జీరో మార్క్స్ వేస్తారు. సెకండాఫ్ కి 20 నుంచి 30 వేయడం వల్ల బెటర్ అనుకోవచ్చు కానీ ఓవరాల్ గా ఓ ఫెయిల్యూర్ బొమ్మ ఇచ్చిన క్రెడిట్ డైరెక్టర్ కృష్ణ విజయ్ కి దక్కింది.

టీజర్ అండ్ ట్రైలర్ లో ఇచ్చిన రెండు డైలాగ్స్ బాగున్నాయి కానీ సినిమాలో అయితే చెప్పుకోదగిన డైలాగ్స్ లేవు, అలాగే రిలీజ్ చేసిన డైలాగ్స్ ఉన్న సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ కూడా బాలేదు. ముఖ్యంగా ఎడిటర్ అయినా ఈ సినిమా రన్ టైం విషయంలో పోరాడి చాలా క్రిస్ప్ గా చేయాల్సింది. మరీ 158 నిమిషాల రన్ టైం ఆడియన్స్ కి పెద్ద అగ్ని పరీక్షలా అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ బాగున్నా వారి శ్రమ, పైసలు సినిమా విజయానికి పెద్ద హెల్ప్ అవ్వలేదు.

విశ్లేషణ:

ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘తిప్పరా మీసం’ సినిమా ఏ పరంగా చూసుకున్నా ఆడియన్స్ కి బోర్ కొట్టించిందే తప్ప, ఎంటర్టైన్ అయితే చేయలేదు. శ్రీ విష్ణు గత సినిమాలతో మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఈ సారి మాస్ ఆడియన్స్ కి దగ్గరవుదాం అని చేసిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించకపోగా తను సంపాదించుకున్న ఓ తరహా ఆడియన్స్ లో కూడా కాస్త నెగటివ్ ఒపీనియన్ తెచ్చుకునేలా చేసింది. మొదటి సినిమా ‘అసుర’తో విషయం ఉంది అనిపించుకున్న డైరెక్టర్ కృష్ణ విజయ్ ఈ సినిమాతో అబ్బే ఇలా అయితే డైరెక్టర్ గా నిలబడటం కష్టమే అనిపించుకున్నాడు. ఓవరాల్ గా ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కి పేరు వస్తుంది. మిగతా ఎవరికీ ఈ సినిమా వల్ల లాభం లేకపోగా, శ్రీ విష్ణు కెరీర్ కి కొంతమేర నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే శ్రీ విష్ణు మాస్ పరంగా ట్రై చేసిన చాలా సినిమాలు ఆయనకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. వాటిలో ‘తిప్పరా మీసం’ కూడా చేరింది. హీరోతో పాటు, థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి కూడా వెచ్చించిన సమయం – పెట్టిన పైసలు రెండూ నష్టమే.!

ఫైనల్ పంచ్: తిప్పరా మీసం – ఎంత తిప్పినా తిరగలేదు.!

వెండి తెర

రాజకీయం

ఎక్కువ చదివినవి