చిరంజీవి సినిమా అంటేనే టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అనే పేరు. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు, రికార్డులే ఇందుకు నిదర్శనం. దీంతో చిరంజీవితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు పోటీ పడ్డారు. 90వ దశకంలో చిరంజీవితో సినిమాలు నిర్మించి సక్సెస్ ఇచ్చిన నిర్మాతల్లో అశ్వనీదత్ ఒకరు. చిరంజీవితో తీసిన నాలుగు సినిమాల్లో ఒక సినిమానే ‘చూడాలని ఉంది’. వీరి కాంబోలో సినిమా అనౌన్స్ తోనే బజ్, క్రేజ్ క్రియేట్ అయ్యేవి. చిరంజీవి మాస్ ఇమేజ్ నుంచి కథ, కథనంపై దృష్టి పెట్టిన తర్వాత ఇచ్చిన వరుస హిట్లలో చూడాలని ఉంది నాలుగో సినిమా. చిన్న పిల్లల సెంటిమెంట్ తో చిరంజీవి చేసిన హిట్ సినిమాల్లో ఒకటి. చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే కథ, కథనం, యాక్షన్ వంటి కమర్షియల్ అంశాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి కొద్దిలో ఇండస్ట్రీ హిట్ మిస్సయ్యింది.
కథ, కథనంలో భారీతనం..
కొడుకుని వెతుక్కుంటూ కలకత్తా నగరం చేరుకునే తండ్రిగా చిరంజీవి కనిపిస్తారు. కలకత్తా నేపథ్యం, స్క్రీన్ ప్లే, యాక్షన్, బైక్ చేజింగ్, సెంటిమెంట్ అంశాలతో కథ, కథనంలో భారీతనం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. కోటి రూపాయలతో అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన కలకత్తా అపార్ట్ మెంట్ అప్పటికి తెలుగు సినిమాల్లోనే భారీ సెట్. ముంబై నుంచి ఖరీదైన అకేలా క్రేన్ తెప్పించి షూటింగ్ చేశారు. అపార్ట్ మెంట్లో అంతస్థులు దాటుకుంటూ చిరంజీవి చేసే ఫైట్ అలరిస్తుంది. అడవిలో ఏనుగును కాపాడే సన్నివేశం, జంతువులను గ్రాఫిక్స్ లో చేసిన పాట చిన్న పిల్లలను ఆకట్టుకున్నాయి. సినిమాలో ప్రకాశ్ రాజ్ విలనిజం కార్పొరేట్ స్థాయిలో భారీగా చూపారు. సినిమాలో రైల్వే స్టేషన్ లో చిరంజీవి-అంజలా ఝవేరి మధ్య రొమాంటిక్ సీన్, బైక్ చేజింగ్ సినిమాకే హైలైట్. చిరంజీవి-సౌందర్య మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆహ్లాదం కలిగిస్తాయి.
సెంటిమెంట్ రిపీట్..
వైజయంతీ మూవీస్ బ్యానర్లో నిర్మాత అశ్వనీదత్ సినిమా నిర్మించారు. తాను రాసిన కథకు దర్శకత్వ ప్రతిభను జోడించి సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు గుణశేఖర్. చిరంజీవి-అశ్వనీదత్ కాంబోలో జగదేకవీరుడు అతిలోక సుందరి తుఫాను సమయంలో విడుదలై హిట్ అయినట్టే చూడాలని ఉంది కూడా వర్షాల మధ్యే విడుదలై సెంటిమెంట్ కొనసాగించింది. ‘కలకత్తా’, ‘ఆంధ్రావాలా’ టైటిల్స్ అనుకున్నా ‘చూడాలని ఉంది’ సూచించారు చిరంజీవి. మణిశర్మ సంగీతం మేజర్ ఎస్సెట్. పాటలన్నీ చార్ట్ బస్టర్సే. కొన్నేళ్లు ఇండస్ట్రీలో ఆయన్ను చూడాలని ఉంది మ్యూజిక్ డైరక్టర్ గానే పిలిచారు. 1998 ఆగష్టు 27న విడుదలైన సినిమా 62 కేంద్రాల్లో 100, విజయవాడలో 175 రోజులు రన్ అయింది. కర్నూలులో జరిగిన శతదినోత్సవ వేడుకల్లో మెయిన్ టెక్నీషియన్లకు చిరంజీవి గోల్డ్ చెయిన్స్ ప్రెజెంట్ చేశారు.