ఢిల్లీకి జగన్‌.. ఈసారీ ‘ఖర్చు దండగ’ వ్యవహారమేనా.?

సీబీఐ కోర్టు తీర్పు.. దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడమంటే ఖర్చు దండగ వ్యవహారమని చంద్రబాబు హయాంలోనే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలు చేసింది స్వయానా ఇప్పుడు అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ‘ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడ్తున్నారు..’ అంటూ వైసీపీ, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మరి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నదేమిటి.? ముఖ్యమంత్రి, ఢిల్లీకి వెళ్ళడం.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం తప్పేమీ కాదు.

కేంద్ర – రాష్ట్ర సంబంధాలు బలోపేతమవడానికి ఇలాంటి పర్యటనలు ఉపకరిస్తాయి. కానీ, అక్కడ కేంద్రం.. రాష్ట్రానికి సాయం చేయాలన్న ఆలోచనతో వుంటేనే.. అది సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తూ కేంద్రానికి ఆ ఆలోచనే లేదు. చంద్రబాబు హయాంలోనూ అదే జరిగింది.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే జరుగుతోంది.

అప్పట్లో పరిస్థితులు, ఇప్పటితో పోల్చితే కాస్త బెటర్‌ అనుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత.. రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేయాలి గనుక.. అప్పట్లో టీడీపీ – బీజేపీ మిత్రపక్షాలు గనుక.. రాష్ట్రానికి కొన్ని ‘పనులు’ నెరవేరిన మాట వాస్తవం. అయితే, అవి పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నదీ నిర్వివాదాంశం.

ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరం. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి దొరకడం గగనమే అయిపోయింది. చంద్రబాబు కూడా, ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. రెండ్రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళి, మోడీని కలిసొచ్చిన వైఎస్‌ జగన్‌, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం భరోసా ఈ సమావేశం ద్వారా వచ్చిందో మాత్రం చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

ఇప్పుడు కూడా రాష్ట్రానికి ఏదన్నా మేలు జరుగుతుందని ఎవరైనా ఆశిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్ళడం దండగ.. ఇది ఖచ్చితంగా ఖర్చు దండగ వ్యవహారమే..’ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలేమాత్రం ఆలోచించరు.. రాష్ట్రంలో మాత్రం, వీర లెవెల్లో హడావిడి చేసేస్తుంటారు. ఒక్కరంటే ఒక్క నాయకుడైనా, తాము అధిష్టానాన్ని ఒప్పించి.. ఒక్క ప్రాజెక్టుని రాష్ట్రానికి తెప్పించామని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా.?