బుల్లితెరపై వస్తున్న ‘జబర్దస్త్ (Jabardasth)’ కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో.. అందులో కమెడియన్లు కూడా అంతే పాపులారిటీ సంపాదించారు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వెండితెర మీద సత్తా చాటుతున్నారు. అలా పాపులారిటీ అందుకున్న కమెడియన్లలో పంచ్ ప్రసాద్ (Punch Prasad) ఒకరు. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రసాద్ చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పలువురు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు మరోసారి అతని పరిస్థితి విషమించిందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
రెండు రోజుల క్రితం ప్రసాద్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలంటూ మరో కమెడియన్ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జబర్దస్త్ నటులందరూ రూ. 8 నుంచి రూ.10 లక్షల వరకు సర్దారని, వైద్యానికి మరికొంత డబ్బు ఖర్చవుతుందని తెలిపాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని.. ఇప్పుడు పరిస్థితి విషమించిందని అన్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకున్నవారు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సాయం అందించవచ్చని నంబర్, స్కానర్ లను పోస్ట్ చేశాడు.