అసలు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఎక్కడున్నాయ్.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఔను, జనసేన పార్టీ ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ మేరకు ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ హ్యాష్ ట్యాగ్ జత చేసి, ఓ వీడియో పోస్ట్ చేశారు.
దాంతో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం, తమ ఇళ్ళ ముందరి రోడ్లు, తమ వీధుల్లోని రోడ్లు, తమ ఊరిలోని రోడ్లు, తమ జిల్లాలోని రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అక్కడా, ఇక్కడా అని తేడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్లు అధ్వాన్నంగా వున్నాయి. అసలంటూ, రోడ్లు వుంటేగా అధ్వాన్నం.. అని అనడానికి.. రోడ్లు కనిపించని ప్రాంతాలే చాలా చోట్ల వున్నాయ్. అంతలా, గుంతలే రోడ్లను మింగేశాయ్.
వందల కోట్లు, వేల కోట్ల రూపాయల్ని రోడ్ల మీద పోసేస్తోంది ప్రభుత్వం, రోడ్ల మరమ్మత్తుల పేరుతో. అలాగని స్వయానా ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చుకుంటోంది. అదికార పార్టీ సోషల్ మీడియా టీమ్ కూడా ఇదే చెబుతోంది. డబ్బులైతే ఖర్చయిపోతున్నాయ్.. మరి, రోడ్లెక్కడ.? ఇదీ ఇప్పుడు సామాన్య ప్రజానీకం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న.
వర్షాకాలంలో రోడ్లు పాడవడం అనేది సాధారణమైన విషయమే. నిజానికి, వర్షాకాలంలో కూడా రోడ్లు పాడవకూడదు. కానీ, పాడవుతున్నాయ్. అసలంటూ, బాగైతే కదా.. పాడవడానికి.? మన పాలనలో వర్షాలు బాగా కురుస్తున్నాయని చెప్పుకుంటూ, రోడ్లను పట్టించుకోవడమే మానేసింది జగన్ సర్కారు.
అధికార పార్టీ నాయకులేమో, విపక్షాల మీద విమర్శలు చేయడానికి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.. బూతుల దండకం అందుకుంటున్నారు. చిత్రమేంటంటే, తాము నివాసం వుంటోన్న ప్రాంతం, గ్రామంలో కూడా రోడ్లను బాగు చేసుకోలేని దుస్థితి అధికార పార్టీ నేతలది. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులు ఇందుకు మినహాయింపేమీ కాదు.
రోడ్లే అభివృద్ధికి నిఖార్సయిన రుజువులు. ఔను, రోడ్లు బావుంటే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధీ లేదు.. రోడ్లూ బాగా లేవ్.! జిల్లాకో ఎయిర్ పోర్ట్ సంగతేమోగానీ, ఇంటికో గుంత అయితే పక్కా.. అన్నట్టుంది పరిస్థితి.
జనసైనికులు, సామాన్యులు నానా తంటాలూ పడి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అంటూ నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారుగానీ, రోడ్ల మరమ్మత్తుల విషయమై వైఎస్ జగన్ సర్కారు నిద్ర నటిస్తోంది.. అలా నటిస్తున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం అసాధ్యం.!