Cyclone Michaung: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం (Cyclone Michaung) తుపాను తీవ్రంగా మారుతోంది. మంగళవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లాలోని దివిసీమలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే రాయలసీమలోని తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, దక్షిణ కోస్తాలో శనివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి అలల తీవ్రత కూడా పెరిగింది. వర్షాలకు పూరి గుడిసె కూలి తిరుపతి జిల్లాలో 4ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరోవైపు.. తుపాను తీవ్రతపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదివారం సాయంత్రానికి తుపాను మచిలీపట్నంకు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోస్తాంధ్రాల్లో భారీ నుంచి అతిభారీ, బుధవారం కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.