హైద్రాబాద్ నడిబొడ్డున కాస్సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. దాదాపు పద్ధెనిమిదేళ్ళ తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో కొంత మేర ఆ పార్టీ విజయం సాధిస్తున్నట్లే భావించాలి.
ఒకే ఒక్క ఎమ్మెల్యేతో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ ఇచ్చింది బీజేపీ. గ్రేటర్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో దెబ్బ కొట్టి, అసెంబ్లీలో తన బలాన్ని సింగిల్ సీటు నుంచి మూడు సీట్లకు పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలిచి, అధికార పీఠమెక్కుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైద్రాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సీరియస్‌గా తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు.? అన్నదానిపై ముందే ఊహించిన కేసీయార్, ఆయన్ని లాక్ చేసేందుకోసమన్నట్టు, పలు ప్రశ్నలు సంధించారు. దేశాభివృద్ధికి సంబంధించి నరేంద్ర మోడీ ఏం చేశారంటూ నిలదీసిన కేసీయార్, ఆయా ప్రశ్నల్ని బీజేపీ ముందుంచగా, వాటిల్లో ఒక్కదానికీ ఇప్పటిదాకా బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదు.
అయితే, సాయంత్రం కేసీయార్‌ని చెడుగుడు ఆడేలా ప్రధాని నరేంద్ర మోడీ స్క్రిప్ట్ రెడీ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు వీలుగా ఓ డిక్లరేషన్ కూడా బీజేపీ విడుదల చేయనుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి, కేవలం తెలంగాణను ఉద్దేశించి మాత్రమే కాదు, దేశాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. కానీ, షరామామూలుగానే నరేంద్ర మోడీ సొంత డబ్బా కొట్టుకుంటారా.? ప్రత్యర్థులపై అభాండాలు మోపుతారా.? లేదంటే, చిత్తశుద్ధితో, బాధ్యతగల ప్రధానిగా మాట్లాడతారా.? అన్నది వేచి చూడాల్సిందే.