ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం లేదు. సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ కార్యకర్తలే నగిరిలో రోజాకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
నిజానికి, ఇది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన పంచాయితీ కాదు.! 2014 ఎన్నికల్లో లక్కు కలిసొచ్చింది. సింపతీ వర్కవుట్ అయ్యింది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ వేవ్ కలిసొచ్చింది. ఈసారి మాత్రం.. అదీ లేదు, ఇదీ లేదు.!
ఎమ్మెల్యేగా గెలిచినా, రోజాకి నగిరి నియోజకవర్గంలో ఏనాడూ వైసీపీ కార్యకర్తల నుంచి సముచిత గౌరవం లభించింది లేదు. ఈ విషయాన్ని ఆమే పలు సందర్భాల్లో ఏడుస్తూ చెప్పిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఎప్పటికప్పుడు నగిరి వైసీపీ నేతలపై రోజా అసహనం, రోజాపై నగిరి వైసీపీ నేతల అసహనం.. లీకుల రూపంలో బయటకు వస్తూనే వుంది.
ఈసారి మాత్రం నగిరిలో రోజా పట్ల వ్యతిరేకత వేరే లెవల్‌లో వుందన్నది తాజాగా వెల్లడవుతున్న సర్వేల సారాంశం. అసలామెకు టిక్కెట్ రావడమే కష్టమని అంతా అనుకున్నారు. కానీ, రోజాకి టిక్కెట్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసు గనుక, తప్పక ఆమెకి వైఎస్ జగన్ టిక్కెట్ ఇచ్చారట.
రోజాకి టిక్కెట్ వచ్చాక, పలువురు వైసీపీ లోకల్ లీడర్స్.. వైసీపీని వదిలేశారు. కొందరు వైసీపీలోనే వున్నా, వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తామని బాహాటంగానే చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి శూన్యం. రాజకీయ ప్రత్యర్థులపై అడ్డగోలు వ్యాఖ్యలు తప్ప, మంత్రిగా ఆమె నియోజకవర్గానికి చేసిందేమీ లేదని నగిరి ప్రజానీకం చెబుతున్నారు.
ఇంకోపక్క, సినీ నటుడు రజనీకాంత్ మీద కొన్నాళ్ళ క్రితం రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో, నగిరిలో తమిళనాడు ప్రాబల్యం వున్న ఓటర్లలో రోజా పట్ల వ్యతిరేకత అనూహ్యమైన స్థాయిలో వుందిట.
అన్నట్టు, రోజాని ఓడించేందుకు వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరవెనుకాల పక్కా ప్లానింగుతో వున్నారన్నది నగిరి నియోజకవర్గంలో ప్రముఖంగా వినిపిస్తున్నవాదన.