రోజులు గడుస్తున్నాయ్.. రోజులు కాదు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి వుంది.? ఎవరు చంపారు.? ఎవరు చంపించారు.? అసలు ఈ కేసు ఎందుకు ఓ కొలిక్కి రావడంలేదు.?
రాష్ట్ర స్థాయి సిట్ ఏమీ తేల్చలేదు. జాతీయ దర్యాప్తు సంస్థల్లో ఒకటైన.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక దర్మాప్తు సంస్థల్లో ఒకతైన సీబీఐ విచారణ కూడా ఇంతవరకు దోషులెవరో తేల్చకపోవడం ఆశ్చర్యకరం. వైఎస్ వివేకానందరెడ్డిది రాజకీయ హత్యే.! ఎందుకంటే, ఆయనే రాజకీయ నాయకుడు గనుక. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వున్న కాలంలోనే ఈ హత్య జరిగింది.
2019 ఎన్నికల్లో వైఎస్ వివేకాందరెడ్డి హత్య రాజకీయంగా ప్రధాన రాజకీయ పార్టీలకు భలేగా ఉపయోగపడింది. ‘నువ్వే చంపేశావ్.. అంటే, కాదు.. నువ్వే చంపేశావ్..’ అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర నిందారోపణలు చేసుకోవడం చూశాం. నేరాల్ని అదుపు చేయడానికి కొత్త చట్టాలు తెస్తున్నామంటారు.. కానీ, జరిగిన దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే, ఆ మరణంపైనా అనుమానాలున్నాయని తరచూ అంటుంటారు ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు. ఓ నాయకుడి మరణం కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతోందా.? అంటే, ఔనని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలోనే అలా వుంటే, వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ ఎలా తేలుతుంది.?
రాష్ట్రానికి చెందిన కీలక రాజకీయ ప్రముఖుడు హత్యకు గురైతే.. ఆ కేసు గుట్టు వీడకుండా వుంటోందంటే.. పాలకులు ఎలాంటి పాలన అందిస్తున్నారో అర్థం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదు.