ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. దాదాపుగా పరిస్థితి దిగజరారిపోయినట్లుగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో అసలు ప్రాతినిథ్యమే లేకుండా పోతుందా.? అన్నంతటి అయోమయం జిల్లా వైసీపీలో కనిపిస్తోంది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ గురించి ఘనంగా చెబుతున్నా, స్థానిక పరిస్థితులు మాత్రం వైసీపీకి షాక్ ఇచ్చేలానే మారుతున్నాయి.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ ముఖ్య నేతలుగా చెప్పబడుతున్నవారంతా వైసీపీకి ఉపయోగం లేకుండా పోతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతలేమో వైసీపీని వదిలి వెళ్ళడం ఖాయమైపోయింది. ఈ లిస్టులోకి తాజాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరిపోతున్నారు.
ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మొత్తంగా 60 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయమై అసహనంతో వున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడం గమనార్హం. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డిది కూడా దాదాపు ఇదే వాదన.
అసలు నెల్లూరు జిల్లాలోనే ఈ ‘కుంపటి’ ఎందుకు రాజుకుంది.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొన్నాళ్ళ క్రితం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ‘నెల్లూరు ఎక్స్‌ప్రెస్’ వ్యాఖ్యల్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.
నెల్లూరు వైసీపీ రాజకీయం అప్పటినుంచే నివురుగప్పిన నిప్పలా వుంటూ వచ్చింది. అదిప్పుడు భగ్గుమందంతే. ‘ఎవరెలా పోయినా మాకేం నష్టం లేదు..’ అంటూ వైసీపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో పార్టీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి ఏర్పడింది. తదుపరి ‘పొలిటికల్ బ్లాస్ట్’ ఉభయ గోదావరి జిల్లాల్లో.. అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
పరిస్థితులు చూస్తోంటే, వైసీపీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లో వున్నట్లే కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.