జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ తాజాగా ప్రసారమైంది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా చాలా తక్కువ. మామూలుగా టాక్ షో అంటే, అట్నుంచి ప్రశ్నలు వస్తాయ్.. వాటికి సమాధానాలు చెప్పాల్సి వుంటుంది. పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పారు. తన గురించి తాను పవన్ కళ్యాణ్ ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ తరఫున నందమూరి బాలకృష్ణ పూర్తిస్థాయిలో వకాల్తా పుచ్చుకోవడం.
‘ఇంకొకసారి ఆయన గురించి.. పెళ్ళిళ్ళ గురించీ మాట్లాడితే.. మీరు ఊర కుక్కలతో సమానం..’ అంటూ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ ఊర మాస్ వార్నింగ్ ఇచ్చేశారు.
ఈ వార్నింగ్ ఎవరికి.? ఇంకెవరికి వైసీపీ నేతలకి. వాళ్ళకే కాదు, తెలుగుదేశం పార్టీలోని చాలామంది నాయకులకు కూడా. అదేంటీ, నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేనే కదా.? అయినాసరే, పవన్ కళ్యాన్ వ్యక్తిత్వానికి నందమూరి బాలకృష్ణ ఫిదా అయ్యారు. అదీ అసలు సంగతి.
బహుశా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇంత గొప్పగా చెప్పి వుండరేమో.. అనేంతలా ఎపిసోడ్ అంతటా వీలు చిక్కినప్పుడల్లా బాలకృష్ణ చెబుతూనే వున్నారు.
కాగా, ‘నేను మూడు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకోలేదు.. ముగ్గురితో ఒకేసారి సంసారం చెయ్యలేదు. వ్యామోహంతో పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అనుకోకుండా జరిగాయంతే.. అదీ చట్టబద్ధంగా విడాకుల తర్వాతనే..’ అంటూ పవన్ కళ్యాణ్, మూడు పెళ్ళిళ్ళపై బాలకృష్ణ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
రాజకీయాల గురించి ఎవరితో చర్చిస్తారు.? అనడిగితే, ‘నాలో నేనే చర్చించుకుంటాను. పుస్తకాలు చదువుతాను. రాజకీయాలకు సంబంధించి ఏ సందేహం వచ్చినా.. అంబేద్కర్, కాన్షీరాం లాంటి గొప్ప నాయకులు చెప్పిన విషయాలను చదవడం ద్వారా ఆ సందేహాల్ని తీర్చుకుంటాను..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో స్నేహం చేయాల్సి వచ్చిందని చెప్పిన పవన్ కళ్యాణ్, ‘ఆయన నాకు స్నేహితుడు అనడం కంటే.. గురువు అనడం కరెక్టేమో..’ అని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని విని, నందమూరి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. ‘దర్శకుడికి గురువు స్థానం ఇచ్చిన మీ గొప్ప మనసుకి నేను ఫిదా అయిపోయాను..’ అన్నారు బాలకృష్ణ.
ఓ సందర్భంలో, ‘నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఈ క్షణం నుంచి నీ మీద నాకు గౌరవం మరింత పెరిగింది..’ అంటూ బాలకృష్ణ చెప్పడం మరో ఆసక్తికరమైన సందర్భం. ‘తొలిప్రేమ’ సినిమాకి తొలుత రెమ్యునరేషన్ ఇవ్వలేదనీ, తాను తీసుకోలేదనీ, సినిమా 100 రోజులు ఆడాక రెమ్యునరేషన్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
‘గబ్బర్ సింగ్’ సినిమాకి రెమ్యునరేషన్ గట్టిగా ఇచ్చారా.? అంటే, నేను అడిగినంత ఇవ్వలేదు.. ఆయన (బండ్ల గణేష్) ఇవ్వాలనుకున్నంత ఇచ్చారు.. అని పవన్ చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.
దీనిపై బండ్ల గణేష్ ఓ నెటిజన్ సంధించిన ప్రశ్నకు బదులిస్తూ, ‘భగవంతుడు అడగడు.. భక్తుడు ఇస్తాడు..’ అంటూ స్పందించడం విశేషం.
అన్నట్టు, ఎపిసోడ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ‘సాయి ధరమ్ తేజ్ సహా, చిరంజీవిగారి కుటుంబంలో పిల్లలందరికీ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు వచ్చాయి..’ అని బాలకృష్ణ చెప్పారు. ‘వారు పెరిగిన వాతావరణం అలాంటిది..’ అని చెప్పిన పవన్ కళ్యాణ్, ‘వారు ఎవరికైనా గౌరవం ఇచ్చారంటే అది నిజం.. అందులో నటన వుండదు..’ అని పేర్కొన్నారు.
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ‘‘మూడు రోజుల వరకు డాక్టర్లు ‘ఏమీ చెప్పలేం’ అన్నారు. ఆ క్షణం చాలా బాధ కలిగింది. సాధారణ యాక్సిడెంట్ అయినా.. రకరకాల పిచ్చి ప్రచారాలు జరిగాయి.. అవి మరింత బాధ కలిగించాయి..’ అని అన్నారు.
పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ (మెడ మీద చేతిని రుద్దడం), బాలకృష్ణ సిగ్నేచర్ (తొడ కొట్టడం).. వీటి గురించి బోల్డంత ఫన్ నడిచింది. పెళ్ళి గురించి సాయి ధరమ్ తేజ్‌ని బాలయ్య అడిగితే, ‘చేసుకుంటాడు తప్పకుండా’ అని పవన్ చెప్పారు. సాయి ధరమ్ తేజ్ మాత్రం, ‘మొన్నే ప్రమాదం నుంచి బయటపడ్డా.. మరో ప్రమాదమా.?’ అంటూ బాలయ్యతో చెప్పాడు.
మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రెండో ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా వుండబోతోంది. పవన్ కళ్యాణ్ బాల్యం, సినిమాల్లోకి రాకముందు విషయాలు.. ఇవన్నీ వచ్చే ఎపిసోడ్‌లో.!