డప్పు వాయిద్యాల దండు ముందు నడుస్తుండగా వెనుక అభ్యర్థి, ఆయన చుట్టూ ప్రచార సామగ్రి, జెండాలు పట్టుకున్న కార్యకర్తలు.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి, చేతిలో చేయి వేసి ఓటడిగి, కుదిరితే అలయ్‌బలయ్.. ఎన్నికల ప్రచారమనగానే కొన్నేళ్ల వరకు కనిపించిన దృశ్యమిదీ. పల్లెలు, పట్టణాల్లో ఇదే తరహాలో జరిగేది.
కానీ ఇప్పుడు ప్రచారం తీరు మారింది. ఇంటింటి ప్రచారం దాదాపు కనుమరుగవుతోంది. ప్రచారం చేసే అభ్యర్థులను ఇంటి ముందుకొచ్చి చూసే జనం కరువవుతున్నారు. మైకు సౌండు వినిపించగానే తలుపులేసి లోపలే కూర్చుంటున్నారు. నేరుగా జనాన్ని కలిసి ఓటు అడిగే పరిస్థితి హైదరాబాద్ కాలనీల్లో దాదాపు కనుమరుగైంది.
అభ్యర్థి పాదయాత్రతో వస్తే చూసే జనమే లేకుండా పోవటంతో వారు తీరు మార్చుకోక తప్పలేదు. సంప్రదాయ ప్రచారం కంటే సామాజిక మాధ్యమ ప్రచారమే ఎక్కువగా జనానికి చేరుతోందని దాదాపు తేలిపోయింది. దీంతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంది.
సోషల్ మీడియా ప్రచారానికి ప్రధాన అభ్యర్థులంతా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిని నెల రోజుల కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.
గతంలో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఉన్నవారు వారి పదవీ కాలంలో చేసిన పురోగతి, ప్రజల పక్షాన చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పుడు గెలిస్తే చేయబోయే పనులు, ఊరువాడా అభివృద్ధికి వేసుకున్న ప్రణాళికలు, వారు పోటీ చేస్తున్న పార్టీ ఘనత, రాజకీయ నేపథ్యం ఉన్నవారు వారి పూర్వీకులు చేసిన కార్యక్రమాలు.. ఇలా వీలైనన్ని వీడియోలు రూపొందించి వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లకు చేరవేస్తున్నారు.
కొందరైతే ఏకంగా త్రీడీ చిత్రాలు రూపొందించి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరి పక్షాలను విమర్శించేందుకు ఎక్కువగా దీన్ని వాడుకోగా, ఈసారి తమ గురించి ఎక్కువగా చెప్పుకునేందుకే ప్రాధాన్యమిస్తుండటం విశేషం. చూడాలి ప్రచారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో?