Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా చిట్ చాట్ చేశారు. ఇరువురు కూడా తమ రాజకీయ నేపథ్యం మరియు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, మోడీ గురించిన విషయాలను మాట్లాడుకున్నారు. ఎన్నికల వేల చిరంజీవి మరియు కిషన్ రెడ్డిల చిట్ చాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి మాట్లాడుతూ… నేను శాసన సభ్యుడిగా తొలి సారి సభలో అడుగు పెట్టిన సమయంలో కొత్తగా అనిపించింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, దుర్భాషలాడుకుంటూ లైవ్ లో తిట్టుకుంటూ ఉంటే నేను వారి భాషను విని షాక్ అయ్యాను. అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా అని ఆ సమయంలో అనిపించింది.
నాకు ఒక వైపు మీరు మరో వైపు జయప్రకాష్ నారాయణ గారు ఉండేవారు. నాకు తెలిసినంత వరకు మీరు అసెంబ్లీలో ఎప్పుడు కూడా దుర్బాషలాడలేదు. ఏదైనా పాయింట్ తీసుకుంటే దాని మీద సరిగ్గా మాట్లాడేవారు తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడుతూ పాయింట్ తప్పేవారు కాదు. సభా మర్యాద అనేది మీ నుంచి నేర్చుకున్నాను.
నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రేణిగుంటలో కలనరీ ఇన్సిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ను కోరడం జరిగింది. కానీ ఆయన అందుకు ఆసక్తి చూపించలేదు. నేను పలు సార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాత దానికి అనుమతి వచ్చింది. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం, నేను మంత్రిగా రాజీనామా చేయడం వంటివి జరిగాయి. ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగుతుందని అనుకున్నాను. కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యింది అన్నారు.
కరోనా సమయంలో సినీ పరిశ్రమకు నావంతు సాయం చేశాను. అభిమానుల సహకారంతో ఎంతో మందికి అండగా నిలిచాం. కశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. అయితే ఆ సమయంలో నేను రాలేక పోవడంతో చరణ్ ను పంపించాను అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు మోడీ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అద్వానీ గారు యువ నాయకులను అమెరికాకు పంపించాల్సి వచ్చినప్పుడు ఏపీ నుంచి నన్ను గుజరాత్ నుంచి మోడీ గారిని మరి కొంత మందిని పంపించడం జరిగింది. అప్పట్టి జ్ఞాపకాల తాలుకు ఫోటోలు ఇంకా నా వద్ద ఉన్నాయి.
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేయడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు అనేది దేశ చరిత్రలో అత్యంత కీలక పరిణామం. 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఇప్పటి వరకు 300 సినిమాలకు పైగా షూటింగ్ జరుపుకున్నాయి అన్నారు. ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను చిరంజీవితో కిషన్ రెడ్డి పంచుకున్నారు.