ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల ప్రచారం అనూహ్యమైన స్థాయికి వేడెక్కింది.
పోలింగ్ సమీపిస్తున్న దరిమిలా, తెరవెనుకాల ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారం నిలబెట్టుకోవాలన్న కోణంలో, అధికార వైసీపీ.. అనూహ్యమైన స్థాయిలో ఓటర్లను ప్రలోభపెడుతోంది.
మరీ ముఖ్యంగా, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో, వైసీపీ అభ్యర్థి వంగా గీత తరఫున, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి.
ఇప్పటికే ఓటుకి ఐదు వేల రూపాయల చొప్పున పంపకాలు షురూ అయ్యాయి. ‘మేం జనసేనకే ఓటు వేస్తాం..’ అని జనం తేల్చి చెబుతున్నా, బలవంతంగా వారి చేతుల్లో డబ్బులు పెట్టి మరీ, వైసీపీకి ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు.. వైసీపీ మద్దతుదారులు. ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే, పిఠాపురంలో డబ్బుల పంపకాలు చేపడుతుండడం గమనార్హం.
పిఠాపురం మాత్రమే కాదు, కాకినాడలో, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి వుంది. కనీస మొత్తం 2 వేలు కాగా, గరిష్టంగా ఏడెనిమిది వేల రూపాయల వరకు ఓటు రేటు కనిపిస్తోంది కాకినాడ నియోజకవర్గ పరిధిలో.
గంప గుత్తగా.. అంటే, నాలుగైదు ఓట్లు అంతకన్నా ఎక్కువ ఓట్లున్న కుటుంబాలకు జాక్ పాట్ తగిలినట్లే.. అన్నట్లు తయారైంది పరిస్థితి. చిత్రమేంటంటే, వైసీపీ విసృతంగా డబ్బులు పంచేస్తూ, జనసేన పార్టీనే డబ్బులు పంచుతోందనీ, జనసేన తరఫున టీడీపీ డబ్బులు పంచుతోందని తమ అను‘కుల’ మీడియాతో ప్రచారం చేయిస్తుండడం.
‘ఎన్నికల్లో మిమ్మల్ని ప్రలోభపెట్టలేను.. నన్ను గెలిపిస్తే, మీకు మంచి చేస్తాను. ఓడినా స్వార్జితంతో మిమ్మల్ని ఆదుకున్నోడిని..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గత ఎన్నికల్లోనూ చెప్పారు.. ఇప్పుడూ అదే చెబుతున్నారు.