ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వారు సమ్మెకు వెళ్లబోతున్నారు. ఈ సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు మద్దతిస్తున్నారు. సమ్మెలో పాల్గొనేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత తెలిపారు. ఎన్టీవో కార్యాలయంలో జరిగిన పీఆర్సీ సాధన సమితి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా తమ సమస్యలు అలానే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ వస్తుందని భావించినా 19 శాతం తక్కువగా వస్తోందన్నారు.
ఆర్టీసీలో నాలుగేళ్లకోసారి ఉండే వేతన సవరణ.. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా పదేళ్లకు మారిందన్నారు. గతంలో తమకు హెచ్ఆర్ఏ 16 శాతం ఉంటే.. ఇప్పుడు 8 శాతంకు తగ్గడంతో తాము అయోమయ స్థితిలో ఉన్నామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక తాము ఎన్నో సదుపాయాలు కోల్పోయామని.. ఎలా పోరాడాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్నామని అన్నారు. సమ్మెలో పాల్గొని అవసరమైతే రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామని అన్నారు.