విద్య, వైద్యం.. వీటిని లాభాపేక్షతో సంబంధం లేకుండా చూడాలి. కానీ, విద్య అలాగే వైద్యం.. ఈ రెండిటికి సంబంధించి వచ్చేంత లాభం.. ఇంకే రంగంలోనూ కనిపించదు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తక్కువే వ్యాపారం జరుగుతోంది, ‘విద్య – వైద్యం’తో పోల్చితే.
చిన్నపాటి జ్వరం వస్తే, జస్ట్ ఓ ట్యాబ్లెట్‌తో తగ్గిపోయే రోజులు కావివి. లక్షల్లో వసూలు చేస్తున్న ఆసుపత్రులున్నాయి.. ఉత్త జ్వరానికే.! ఇది కార్పొరేట్ హెల్త్ మాఫియా ఫలితం. చిన్నా చితకా ఆసుపత్రులు కూడా సాధారణ జ్వరాలకి వేలల్లో ఫీజులు వసూలు చేస్తుండడం చూస్తున్నాం.
చదువు విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎల్కేజీకే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి. అంతలా అక్కడ ప్రత్యేకమైన చదువులు ఏం చెబుతారు.? రెండు ప్లస్ రెండు ఎక్కడైనా నాలుగే కదా.? కార్పొరేట్ విద్యా సంస్థల్లో అది ‘ఐదు’ అయ్యే పరిస్థితి వుండదు కదా.?
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో కార్పొరేట్ విద్య, వైద్య వ్యవస్థల్లో పెను ప్రకంపనలు బయల్దేరాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు కంగారు పడుతున్నాయి. మెడిసిన్ సీటు కావాలంటే, కోటి.. ఆ పైన ఖర్చు చేయాల్సిందే ఈ రోజుల్లో. ఇంజనీరింగ్ అయినాగానీ లక్షలు గుంజేస్తున్నారు. ఎల్కేజీకే లక్ష లాగేస్తున్నప్పుడు, ఇంజనీరింగ్‌కి పాతిక లక్షలు, యాభై లక్షలు లాగేస్తే వింతేముంది.? మెడిసిన్ అంటే, ఐదారు కోట్లు నొక్కేస్తే తప్పేముంది.?
మెడికల్ కాలేజీ అంటే, దానికి అనుబంధంగా ఓ ఆసుపత్రి వుండాలి. అక్కడ నిజానికి, తక్కువ ఖర్చుతో వైద్యం అందాలి. కానీ అదొక మాఫియా.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నదే ఈ ఎడ్యుకేషన్, హెల్త్ మాఫియా వల్ల. ఔను, ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ రంగాలకు చెందినవారే ఎక్కువగా వుంటున్నారు. ప్రభుత్వాల నిర్ణయాలూ వారికి అనుకూలంగానే వుంటాయ్. ఇంకెలా వ్యవస్థ మారుతుంది.? ఛాన్సే లేదు.