కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలకు ‘యెస్’ అనేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందా.? సర్వోన్నత న్యాయస్థానం అబ్జర్వేషన్ ఇదే.! చిన్న విషయంగా దీన్ని చూడలేం. సర్వోన్నత న్యాయస్థానం ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి.
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా అనుసరిస్తున్న వైఖరి పట్ల చాలా విమర్శలున్నాయి. అధికారంలో ఎవరుంటే వాళ్ళు తమకు అనుకూలమైనవారికి ఆ పదవి ఇచ్చుకుంటున్నారు. తద్వారా ఎన్నికల్లో తమకు రాజకీయ లబ్ది కలిగేలా చూసుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ.
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏం జరిగిందో చూశాం.! రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ‘కుల జాడ్యం’ ఆరోపణలు కూడా వచ్చాయి. అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిధిలో ఎన్నికల ప్రధాన అధికారులు.. తమ బాధ్యతల్ని సక్రమంగా ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు.?
ఆయా పార్టీలకు ఎన్నికల గుర్తుల దగ్గర్నుంచి, చాలా విషయాల్లో ‘ఎన్నికల వ్యవస్థ’ కొందరికి అనుకూలంగా, ఇంకొందరి పట్ల వేరే రకంగా ఎందుకు వ్యవహరించగలుగుతోంది ఎన్నికల వ్యవస్థ. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సందర్భంగా రిగ్గింగులు జరిగినా, ఇంకా దారుణమైన అక్రమాలు జరిగినా.. అక్కడ రీ-పోలింగ్ విషయమై కీలక నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోతున్నారంటే.. దాని వెనుక వుంటోన్న రాజకీయ కుట్రలేంటి.?
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ని ఎంపిక చేసే ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వుంటే, మొత్తం వ్యవహారం సాఫీగా సాగిపోతుందని అనలేం. ఎందుకంటే, ఆ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాని న్యాయమూర్తి అయిన వ్యక్తి మీద కూడా కులం పేరుతోనో, ఇంకో కోణంలోనో రాజకీయ ఆరోపణలు చేస్తున్న రోజులివి.
సీబీఐని పంజరంలో చిలక.. అని సర్వోన్నత న్యాయస్థానమే అభివర్ణించింది. ఆ సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని అధికారంలో వున్న పార్టీలు ఎలా వాడేస్తున్నాయో చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతేనా.? అదే నిజమైతే, అసలు ప్రజాస్వామ్యమెక్కడుంది.?