తెలుగు సినిమా పరిశ్రమ లెజెండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మృతి విషయాన్ని మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణి జయరాం మృతి చెందారు. 78 సంవత్సరాల వయస్సున్న వాణి జయరాం నేడు ఉదయం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
తమిళనాడులోని వేలూరులో 1945 నవంబర్ 30 వ తారీఖున వాణి జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి జయరాం తన ఎనిమిదవ ఏటనే కచేరి నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు.
తెలుగుతో పాటు 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన ఆమె సంగీత రంగానికి చేసిన సేవకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మూడు సార్లు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్న వాణి జయరామ్ మృతి యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు నివాళులర్పించారు.