Cyclone Michaung: ప్రచండంగా మారిన తీవ్ర తుపాను మిగ్ జాం (Cyclone Michaung) బాపట్ల సమీపంలో పూర్తిగా తీరం దాటింది. ఈమేరకు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం తుపాను ఈ సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీరంలో తీవ్రమైన ఈదురు గాలులు, వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అక్కడ తుపాను తీవ్రతకు సముద్రపు అలలు 2మీలర్ల మేర ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తీరంలో 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర.. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీగా పంట నష్టం సంభవించింది. దీంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రాయలసీమలోని కొన్ని జిల్లాలు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ ఈదురు గాలులతో చెట్లు, కరెంటు స్థంభాలు నేలకొరిగాయి. మరో 24 గంటలు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.