తెలంగాణలో ఆ జైలుకి ఓ ప్రత్యేకత వుంది. ప్రముఖ కారాగారం అయిన చంచల్‌గూడా, రాజకీయ నిందితులు, నేరస్తులకు కేరాఫ్ అడ్రస్.. అని అంటుంటారు.! నిందితులందరూ నేరస్తులు కాకపోవచ్చనుకోండి.. అది వేరే సంగతి.!
అసలు విషయానికొస్తే, తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కబోతున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే, ఎంపీ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి అవుతున్నారు గనుక, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది.
ఇక, రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా తెలంగాణ ఏసీబీకి చిక్కారు. అప్పట్లో ఆయన టీడీపీ నేత. ఆ కేసు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ సంచలనమే.! రాజకీయాల్లో మళ్ళీ అలాంటి కేసు తెలుగు రాజకీయాల్లో తెరపైకొస్తుందా.? అంటే, ఏమో చెప్పలేం.
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్, అప్పట్లో చంచల్‌గూడా జైలులోనే వున్నారు. అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, అక్రమాస్తుల కేసులో అరెస్టయి, కొన్నాళ్ళపాటు చంచల్‌గూడా జైలులో వున్నారు. ఆ జైలు నుంచి బయటకు వచ్చాక, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
అంటే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇద్దరిలో కామన్ పాయింట్, చంచల్ గూడా జైలు అన్నమాట.! తెలుగునాట ప్రజానీకంలో ఇదే చర్చ జరుగుతోంది. చంచల్‌గూడా జైలుకు వెళితే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పెరుగుతాయంటూ పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి సర్వత్రా.
ప్రజలు ఇంత కామెడీ చేసుకుంటున్నారంటే, రాజకీయం అంత కామెడీ అయిపోయింది. ఆ రాజకీయం ప్రజా సేవ కోసమే అయినప్పుడు, ప్రజలెందుకు రాజకీయాల్ని ఇంత కామెడీగా చూస్తున్నట్టు. తాము ఓట్లేస్తేనే కదా, ఎవరైనా అధికార పీఠమెక్కేది.? ఔను, మార్పు రావాల్సింది ప్రజల్లోనే.!