తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంలేదు. బీజేపీ – జనసేన మధ్య పొత్తు కుదిరింది. జనసేన పార్టీ దాదాపు పది నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. మిగతా నియోజకవర్గాల్లో బీజేపీకి, జనసేన మద్దతునివ్వనుంది.
ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయమై పంచాయితీ నడుస్తోంది తప్ప, జనసేన కోరిన నియోజకవర్గాల విషయమై బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవు. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించింది బీజేపీ.
ఇదిలా వుంటే, జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆ పార్టీకే మద్దతివ్వాలని తెలంగాణలో టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదు. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకే వుండొచ్చు. చంద్రబాబు విషయంలో బీజేపీ స్టాండ్ ఏమైనా సానుకూలంగా మారితే, ఆ బీజేపీకి టీడీపీ శ్రేణులు సహకరించే అవకాశం లేకపోలేదు.
తెలంగాణలో బీజేపీ – జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన రాజకీయ సమీకరణాలు ఇలా వున్నాయి. వైసీపీ, తెలంగాణలో లేనప్పుడు, జనసేన మీదనో.. టీడీపీ మీదనో వైసీపీ కార్యకర్తలు ఏడ్చి ఏం ప్రయోజనం.?
వైఎస్ షర్మిల కూడా తన పార్టీని ఎన్నికల బరిలో దింపడంలేదు. పైగా, ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా, జగన్ అభిమానులైతే తెలంగాణలో వున్నారు. వారి ఓట్లు ఎవరికి పడతాయి.?
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో తెరవెనుక వైసీపీ లాలూచీ పడుతోంది గనుక, ఆ బీజేపీకే ఆ జగన్ అభిమానులు ఓటేస్తారా.? లేదంటే, వైఎస్ షర్మిల చెప్పారు గనుక, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా.? ఆ సంగతి తేల్చుకోవడం మానేసి, జనసేన మీద విమర్శలతో టైమ్ పాస్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు.
బీజేపీ – జనసేన ఈక్వేషన్ తెలంగాణలో వర్కవుట్ అయితే, ఏపీలో షాక్ తగులుతుందన్నది వైసీపీ భయం. అందుకే, తమకు సంబంధం లేని తెలంగాణ రాజకీయాల్లో వైసీపీ ఇదిగో ఇలా వేలు పెడుతోందన్నమాట.