టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి కంచు కోట అయిన ‘కుప్పం మునిసిపాలిటీ’ని కైవసం చేసుకున్నామనే ఆనందంలో వుంది అధికార వైసీపీ. అధికారంలో ఎవరుంటే, వారికి అనుకూలంగా స్థానిక ఫలితాలొస్తాయన్నది ఓపెన్ సీక్రెట్. మొత్తం అధికారాన్ని అక్కడే కేంద్రీకరించడం వల్ల అధికార పార్టీలకు ఇలాంటి ఫలితాలు వస్తుంటాయ్.
కుప్పం ఒకటే కాదు, నెల్లూరు కార్పొరేషన్ సహా పలు నగర పంచాయితీలు.. ఇలా దాదాపు అన్నిటినీ వైసీపీ కైవసం చేసుకుంది. కానీ, దర్శి విషయంలో వైసీపీకి టీడీపీ పెద్ద షాకే ఇచ్చింది. సరే, రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. కుప్పంలో ఓడిపోయింది చంద్రబాబు అయితే, దర్శిలో ఓడిపోయింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకోవాలేమో.
తాజా గెలుపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీటేశారు.. నూటికి తొంభయ్ ఏడు మార్కులు వచ్చాయని. దేవుని దయతో.. అంటూ మొదలు పెట్టి, అక్కా చెల్లెమ్మలు.. అవ్వా తాతలు.. సోదరులు.. అంటూ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపేశారు వైఎస్ జగన్, వైసీపీని గెలిపించినందుకుగాను.
నూటికి తొంభై ఏడు మార్కులు.. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ఉప ఎన్నికలపై వేసుకున్న లెక్క. నిజమేనా, అన్ని మార్కులు వచ్చాయా.? అంటే, దాదాపుగా అన్నీ గెలిచేశారు గనుక.. అలాగే అనుకోవాలి. కానీ, ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా.? ప్రలోభాల పర్వానికి ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించగలిగారా.? అన్నదే కీలకం ఇక్కడ.
నూటికి తొంభయ్ ఏడు ఏం ఖర్మ.? నూటికి నూరూ వేసేసుకున్నా ఎవరూ కాదనరు. కానీ, అలా చేస్తే ‘అతి’ అవుతుందనే కోణంలో ఓ మూడు మార్కులు తగ్గించుకున్నారంతే. ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం.. ఇవేవీ లేకుండా 50 మార్కులు దక్కించుకున్నా.. అది బంపర్ విక్టరీనే. కానీ, పైనవి అన్నీ ఉపయోగించేసి.. వంద మార్కులు తెచ్చుకుంటే మాత్రం.. దాన్ని గెలుపు అని ఎవరైనా అనగలరా.?
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021