తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడీ పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రభుత్వం, రాజ్ భవన్ తరపు న్యాయవాదులు చర్చించి సమస్య పై పరిష్కారానికి వచ్చారు.
అసెంబ్లీ సమావేశాలను రాజ్యాంగబద్దంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దువేకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదించనున్నట్టు రాజ్యభవన్ న్యాయవాది అశోక్ ఆనంద్ కూడా కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు విచారణ ముగించింది.
2023-24కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. ‘గవర్నర్ కు కోర్టు నోటీసులు ఇవ్వగలదా..? గవర్నర్ విధుల్లో కోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చా..? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో ఇరువైపు న్యాయవాదులు అంగీకారానికి రావడంతో సందిగ్ధతకు తెరపడింది.