Tirumala: తిరుమల( Tirumala)లో భద్రతా లోపం మరోసారి బయటపడింది. తిరుమల శ్రీవారి ఆనంద నిలయాన్ని గుర్తుతెలియని భక్తులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం దేవస్థానం మేనేజ్మెంట్ దృష్టికి వెళ్లడంతో విచారణ ముమ్మరం చేసింది. తొలుత ఈ చిత్రాలు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారని భావించినప్పటికీ తర్వాత అవి సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించారని గుర్తించినట్లు తెలుస్తోంది.
ఓ మహిళా భక్తురాలు ఈ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం. రహస్య కెమెరాతో చిత్రీకరించినట్లు నిర్ధారణ అయితే సదరు భక్తురాలని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. సాధారణంగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందే మూడుసార్లు తీక్షణమైన తనిఖీలు ఉంటాయి. అలాంటి చెకింగ్ కౌంటర్లను దాటి మరి వీడియో చిత్రీకరించడం భద్రత విభాగాల నిఘా వైఫల్యాన్ని చాటుతోంది. అయితే ఈ వీడియోలు ఎప్పుడు చిత్రీకరించారనేది తెలియరాలేదు.
శ్రీవారి పుణ్యక్షేత్రం పై ఈ మధ్యకాలంలో పలు వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది నెలల క్రితం తిరుమల కొండపై డ్రోన్ కదలికలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇటీవలే తిరుమలలో గంజాయి అమ్ముతూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆనంద నిలయ దృశ్యాలు వైరల్ కావడంతో నిఘా విభాగాల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు.