ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి వివరాలు రాకుండానే, బులుగు బ్యాచ్ పండగ చేసుకుంది. పచ్చ బ్యాచ్ మీద రెచ్చిపోయింది.
చిత్రమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే బులుగు బ్యాచ్ వర్సెస్ పచ్చ బ్యాచ్ తప్ప.. రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకీ సంబంధించిన వ్యవహారంగా మాత్రం వుండటంలేదు. చంద్రబాబు హయాంలో జరిగిందీ, వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్నదీ ఇదే.
రాజధాని అమరావతికి సంబంధించి కొన్ని నిర్మాణాలు పూర్తి చేయడానికి రాష్ట్ర హైకోర్టు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. అసలు ఆ తీర్పు లోతుల్లోకి వెళితే, అధికారంలోకి వచ్చాక, అమరావతి పనుల్ని పూర్తిగా వైసీపీ సర్కారు పక్కన పడేసింది. మూడు రాజధానుల నాటకానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోన రైతులు కోర్టుకెక్కితే, ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి, డెడ్‌లైన్ విధించింది న్యాయస్థానం.
ఆ తీర్పుకి సంబంధించి కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. అది కూడా ‘గడువు’కి సంబంధించి మాత్రమే.
అంతే తప్ప, రాజధాని వర్సెస్ రాజధానుల వ్యవహారంలో వైసీపీ సర్కారుకి అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఏమీ ఇచ్చెయ్యలేదు. వాటికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం స్టే విధించలేదు. మూడు రాజధానుల అంశం ఇప్పుడసలు చట్ట సభల పరిధిలోనే లేదు. ఎందుకంటే వైసీపీ సర్కారే మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంది.
గడచిన మూడున్నరేళ్ళ కాలంలో ఒకటి కాదు, రెండు కాదు.. పదుల సంఖ్యలో కూడా కాదు.. వంద.. ఆ పైన సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు తినేసింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా పదుల సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తలంటు పోసేసింది.
ఈ క్రమంలో, తమ ప్రభుత్వానికి కలిగిన చిన్న ఊరట నేపథ్యంలో బులుగు బ్యాచ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.! అమరావతి, రాజధాని వర్సెస్ రాజధానుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పుని కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే, అందుకు సుప్రీం నిరాకరించడమంటే.. వైసీపీ సర్కారుకే ‘సుప్రీం షాక్’ తగిలినట్టు కదా ఇక్కడ.?