‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు ఇఫి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ఈ క్షణాల కోసం దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నా. ఈ అవార్డు అందుకోవడం నాతోపాటు.. నా అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. 45ఏళ్లుగా సినిమాల్లో ఉన్న నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శివ శంకర వర ప్రసాద్ అనే నాకు సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో తెలిసింది. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. ఎక్కడ అవినీతి ఉన్నా.. సినీ పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం’.
‘నేను రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చేటప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచించా. కానీ.. నాపై వారు ఎప్పటిలా అదే ప్రేమ చూపించారు. వారి ప్రేమకు ఎప్పుడూ నేను దాసుణ్ని. ఇకపై పూర్తిగా సినిమాల్లోనే ఉంటానని అభిమానులకు, ప్రేక్షకులకు మాట ఇస్తున్నా ప్రస్తుతం సినిమా పరిధి పెరిగింది. సినిమా ఎక్కడ తీసినా అది భారతీయ సినిమాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ భావాలు పోయాయి. నేటి యువ హీరోలు నాకు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ’ అని చిరంజీవి అని అన్నారు.