దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ ని హైద్రాబాద్ లో పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ పూణే లో జరుపుకుంటుంది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు హీరోయిన్ సమస్య వచ్చిపడింది.
నిజానికి ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ భామ అలియా భట్ ని, హాలీవుడ్ భామ డైసీ లను ఎంపిక చేసాడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని డైసీ ప్రకటించి తప్పుకుంది. దాంతో ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న ఆలోచనలో భాగంగా రాజమౌళి ఇప్పటికే బాలీవుడ్ భామలు శ్రద్ధ కపూర్, జాహ్నవి లను సంప్రదించాడట. జాహ్నవి కంటే కూడా శ్రద్ధ కపూర్ అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. ఈ విషయం గురించి చర్చలు జరిపిన శ్రద్ధ కపూర్ కాస్త టైం కావాలని అడిగిందట. సరే అని టైం ఇచ్చారు .. ఫైనల్ గా శ్రద్ధ ఓకే చెబుతుందని అనుకుంటే ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటించే ఉద్దేశం లేదని చెప్పేసింది! దానికి కారణం తెలుపుతూ.. ఇప్పటికే తాను హిందీలో రెండు సినిమాలు ఒప్పుకున్నాను కాబట్టి ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేనని చెప్పేసిందట. దాంతో ఇప్పుడు ఇంకెవరిని అడగాలా అన్న ఆలోచనలో పడ్డాడు మన జక్కన్న.
తాజాగా ఈ సినిమాకోసం ఇప్పుడు పరిణితి చోప్రా పేరు పరిశీలిస్తున్నారు. పరిణీతి కూడా మంచి అవకాశం వస్తే తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో పరిణీతి చోప్రాతో చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతున్నాడు దర్శకుడు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ విషయంలో హీరోయిన్ సమస్య పరిణీతి తో తీరిపోవచ్చు. రామ్ చరణ్ కోసం అలియా భట్ ని ఎంపిక చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన పరిణీతి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి .
