ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 10 వేల కోట్ల రూపాయలట. ఇది తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పిన లెక్క. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువలో తక్కువ అంటే 50 కోట్ల రూపాయల్ని వివిధ రాజకీయ పార్టీలు ఖర్చు చేశాయని జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఈ ఖర్చు ఇంకా చాలా ఎక్కువగా వుందన్నది ఆయన చెబుతున్న విషయం. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఒక్కో ఓటుకీ కనీసం 2 వేల రూపాయల్ని ఆయా రాజకీయ పార్టీలు నిర్ణయించి, పంచేసిన దాఖలాలు చూస్తూ వస్తున్నాం.
అయితే, జేసీ దివాకర్‌రెడ్డి ఓటర్లపైనా సంచలన వ్యాఖ్యలు చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. కూటికి గతిలేనివాడు కూడా ఓటుకి 5 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని జేసీ చెప్పడంతో మీడియా ప్రతినిథులే ముక్కున వేలేసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, జేసీ దివాకర్‌రెడ్డికి కొత్త కాదు. ఆయనకి అదో సరదా. సీనియర్ పొలిటీషియన్‌ని గనుక తాను ఏం చెప్పినా చెల్లిపోతుందనే భావనతో వుంటారు జేసీ దివాకర్‌రెడ్డి. అదే సమయంలో అలవాటులో పొరపాటుగా కొన్ని వాస్తవాలు ఆయన నోటి వెంట బయటకొచ్చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మేం, డబ్బులు పంచడంలేదు’ అని ప్రకటించుకున్న ఒకే ఒక్క పార్టీ జనసేన. ‘మీరు మమ్మల్ని గెలిపించినా, గెలిపించకున్నా మీ వెంటే వుంటాం’ అని చెప్పి మరీ జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అయితే, ఎలాగైనా గెలవాలన్న కసితో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బుని పంచాయి.
డబ్బు తీసుకుని మాత్రమే ఓటర్లు ఓట్లను వేస్తారనుకోవడం పొరపాటు. ఓటర్లలోనూ చాలా చైతన్యం వచ్చింది. ఇంటికి వచ్చి మరీ ఆయా పార్టీలకు చెందినవారు డబ్బులు చేతుల్లో పెడుతున్నప్పుడు కొందరు తీసుకుని వుండొచ్చుగాక. కానీ, ఓటు ఎవరికి వెయ్యాలన్నదానిపై ఓటర్లకు ఖచ్చితమైన అవగాహన వుంటుంది. పైగా, రాజకీయ పార్టీలే చెప్పాయి ‘ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి, మీకు నచ్చినోళ్ళకు మాత్రమే ఓటు వేయండి’ అని. దాంతో, ఈసారి ఓటర్లు మరింత విజ్ఞతను ప్రదర్శించినట్లు అర్థమవుతోంది.
ఓటరు ఓటు కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే, అది వారి తప్పు కాదు. సంక్షేమ పథకాల పేరుతో తమ చేతుల్లో పప్పూ బెల్లం పెడుతూ, ప్రజా ప్రతినిథులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతోంటే, పార్టీలకతీతంగా నేతలు కోట్లు వెనకేసుకుంటోంటే ఓటర్లు మాత్రం ఎందుకు మారకూడదు? ఎన్నికల నిర్వహణ సైతం అత్యంత అచేతనావస్థలో నడిచింది ఈసారి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకకపోయింది ఎన్నికల కమిషన్.
వ్యవస్థలో ఇలాంటి లోపాల్ని రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటున్నాయి గనుకనే, ఎన్నికల ప్రక్రియ అంటేనే ప్రజల్లో అసహనం, అయిష్టం పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో మార్పు రావాలంటే జేసీ దివాకర్‌రెడ్డి చెబుతున్న మాటలు ‘ఎన్నికల వేళ తిన్న దెబ్బ’ కారణంగా బయటకొచ్చినట్టు అర్థం చేసుకోవాలి. ఖర్చు తడిసి మోపెడైపోవడంతో ఆ బాధలోనే జేసీ దివాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరెంత ఖర్చు పెట్టారు?’ అని మీడియా అడిగితే, ‘అందరం ఖర్చు చేశాం.. మేం పంచాం, ఇంకొకరు పంచారు. అందరం 50 కోట్ల దాకా పంచినట్లే లెక్క’ అని తెలివిగా జేసీ సమాధానమిచ్చారు.
