సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరగడంతో జనవరి 31 వరకూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో మళ్లీ పాఠశాలల పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
పాఠశాలల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. పాఠశాల సిబ్బంది, యాజమాన్యం, విద్యార్ధుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ తగ్గడం, పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.