ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీజేపీ ఏం చేస్తోంది.? ఏం ఆశిస్తోంది.? తెలంగాణ బీజేపీని చూసి కూడా ఏపీ బీజేపీ నేతలు పదునైన రాజకీయ వ్యూహాల్ని రచించలేకపోతున్నారు. దూకుడు విషయంలో తెలంగాణ బీజేపీ, ఏపీ బీజేపీ తీరు దాదాపు ఒకేలా వున్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అస్సలేమాత్రం పెదవి విప్పలేని దుస్థితి ఏపీ బీజేపీ నేతలది.
తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు కావొచ్చు. మిత్రపక్షం జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కలుపుకుపోవాల్సిన అవసరం బీజేపీకి వుంది. కానీ, ఆ మిత్రపక్షంతోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు ఏపీ కమలనాథులు. అది అమరావతి విషయంలో కావొచ్చు.. విశాఖ స్టీలు ప్లాంట్ విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు.
ఇక, వివాదాల విషయంలో మాత్రం ఏపీ బీజేపీ నేతలు తగ్గేదే లే అంటున్నారు. నోటి దురద విషయానికొస్తే, ఏపీ బీజేపీ నేతలు రెండాకులు ఎక్కువే చదివేచేశారు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా బుక్కయిపోతున్నారు. మొన్న చీప్ లిక్కర్ వ్యవహారం.. తాజాగా కడప జిల్లా వాసులపై ‘హత్యలు చేసేవాళ్ళు..’ అనడం.. వెరసి, ఏపీ బీజేపీని రాష్ట్రంలో అనాధగా మార్చేసింది.
హత్యలు చేసేవాళ్ళకి విమానాశ్రయం కావాలట.. అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అస్సలేమాత్రం క్షమార్హం కాదు. క్షమాపణ చెప్పి చేతులు దులిపేసుకోవాలనుకున్నారు సోము వీర్రాజు. కానీ, దుమారం ఆగేలా కనిపించడంలేదు. ఒకటికి రెండు సార్లు క్షమాపణ చెప్పినా, సోము వీర్రాజు ఈ వివాదం నుంచి బయటపడటం కష్టమే.
అసలు సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో బీజేపీకి నాలుగు ఓట్లన్నా పెరిగాయా.? జనసేన – బీజేపీ మధ్య సఖ్యత పెరిగిందా.? రాష్ట్రానికి ఏదన్నా మేలు జరిగిందా.? ఏదీ లేదాయె. బీజేపీతోపాటు, జనసేన ఇమేజ్‌కీ దెబ్బ పడేలా వుంది సోము వీర్రాజు తీరుతో. ఇదే తీరు బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీతో జనసేన కలిసి ముందడుగు వేయడం కూడా అసాధ్యమే.