ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద కట్టబడుతున్న పోలవరం ప్రాజెక్టుని, కృష్ణా నది మీద కడుతోన్న ప్రాజెక్టుగా అభివర్ణించేశారు సదరు వైసీపీ ఎమ్మెల్యే. ఇదీ అధికార పార్టీలోని నేతలకున్న పరిజ్ఞానం.
ఇక, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే, తనది ఏ శాఖ అన్నది మర్చిపోయినట్టున్నారు. ‘బూతులు మాట్లాడటమే రాజకీయం’ అనుకుంటున్న వైసీపీ నేతల జాబితాలో ఆయన పేరు ఎప్పుడో చేరిపోయింది. తన శాఖని నోటి పారుదల శాఖగా భ్రమపడుతున్న అనిల్ కుమార్ యాదవ్, పోలవరం ప్రాజెక్టు విషయమై విపక్షాలు, ప్రజలు ప్రశ్నిస్తోంటే, తట్టుకోలేక, ‘నోటి పారుదల’ పైత్యం ప్రదర్శిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుని 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఇదే అనిల్ కుమార్ యాదవ్ గతంలో ప్రకటించారు. అది కాస్తా, 2021 డిసెంబర్ నాటికి వాయిదా పడింది. ‘మేం చేసి తీరతాం.. విపక్ష నేతల్ని కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తాం..’ అంటూ అసెంబ్లీలో సెటైర్లేస్తూ ప్రకటించేసిన అనిల్ కుమార్ యాదవ్ మీద సహజంగానే ప్రశ్నలొస్తాయ్.
డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అనిల్ కుమార్ యాదవ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్యాగ్ చేస్తూ ఈ ట్రోలింగ్ పరంపర కొనసాగింది. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
బూతులతో విరుచుకుపడిపోయారు మీడియా సాక్షిగా ట్రోలంగ్ మీదా.. అలాగే టీడీపీ అనుకూల మీడియా మీదా.. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ మీదా.. తన నోటిపారుదల అనుభవం ప్రదర్శించేశారు అనిల్ కుమార్ యాదవ్.
విపక్షల విమర్శలపై రాజకీయంగా ఎదురుదాడి చేయడం అనేది అధికార పార్టీకి కొత్త కాదు. మంత్రి స్థాయిలో వున్న వ్యక్తి, ఇలా అభ్యంతకరమైన భాష మీడియా సాక్షిగా ఎలా ఉపయోగించగులుగుతున్నారన్నదే అసలు ప్రశ్న.