సినీ పరిశ్రమలో కుల పైత్యం వుందా.? లేదా.? నూటికి నూరు పాళ్ళూ వుందంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఈ రోజుల్లో కూడా ఈ జాడ్యమా.? అంటే, దానికి కోట నుంచి ‘ఔను’ అనే సమాధానమే వచ్చింది.. అంతేనా, ఆ పైత్యాన్ని ఆయన సమర్థించేసుకున్నారు కూడా.
కోట శ్రీనివాసరావు, తన సుదీర్ఘ నట జీవితంలో 90 శాతం పైగా తిన్నది ‘కమ్మ’వారి తిండి అట. ఔనా.? ఈ మాట ఎవరైనా అనగలరా.? ఏ రూపాయి మీద అయినా, ఫలానా కులం పేరు ముద్రించి రిజర్వు బ్యాంకు పంపుతోందా.? లేదంటే, ఏదన్నా తిండి గింజ మీద కులం ముద్ర వేసి మార్కెటింగ్ చేస్తున్నారా.? ఫలానా కులం పెట్టే తిండి తింటే ఒకలా, ఇంకో కులం పెట్టే తిండి తింటే ఇంకొకలా ‘బలుపు’ వచ్చి పడుతుందా.?
వయసు మీద పడే కొద్దీ జ్ఞానం తగ్గుతున్నట్టుంది కోట శ్రీనివాసరావుకి. లేకపోతే, ఆయన కులం పేరుతో వ్యాఖ్యలు చేయడమేంటి.? ఆ కులం తిండి తిన్నాను కాబట్టే, మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణుకి ఓటేశానని చెప్పడమేంటి.? చిత్రమేంటంటే, ఓ ఓటు విష్ణుకి వేసి, ఇంకో ఓటు శ్రీకాంత్‌కి వేశానని కోట అంటున్నారు. ఇక్కడా ‘కులం’ అనే జాడ్యాన్ని ఆయన కొనసాగించారనుకోవాలా.? నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని అనుకోవాలా.?
కొన్నాళ్ళ క్రితం, ఓ సందర్భంలో సినీ నటుడు బాలకృష్ణ తన మొహమ్మీద కాండ్రించి ఉమ్మేశారని ఇదే కోట శ్రీనివాసరావు చెప్పుకున్నారు. తాజాగా, మోహన్ బాబు తనను షూటింగ్ సమయంలో తిట్టిన తిట్ల గురించి చెప్పుకున్నారు. అయినాగానీ, మోహన్ బాబు అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు కోట శ్రీనివాసరావు.
ఔను మరి, తిట్టింది ‘కమ్మ’గా అనిపించడానికి కారణం.. ఆ తిట్లు తిట్టింది మోహన్ బాబు కాబట్టి. ఇక్కడా కుల జాడ్యమే తన ఆత్మగౌరవాన్ని చంపేసినా.. ఆత్మని చంపేసుకుని, తుడిచేసుకుపోయానని కోట చెప్పినట్లుంది. కోట శ్రీనివాసరావు అంటే సీనియర్ నటుడు.. ఆయనంటే చాలామందికి చాలా చాలా గౌరవం వుంది. దురదృష్టవశాత్తూ కోట తన గౌరవాన్ని తానే కించపర్చుకుంటున్నారు. అందరిలోనూ అభాసుపాలైపోతున్నారు.