Cyclone Michaung: మిగ్ జాం (Cyclone Michaung) తుపాను ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం కావలికి 40కి.మీ, బాపట్లకు 80కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం తీరం దాటనుంది. ప్రస్తుతం తీరం వెంబడి ఉత్తర దిశగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. తుపాను కారణంగా కోస్తాంధ్రలోని ఏలూరు, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి , చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో 90 నుంచి 110కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. దివిసీమ ప్రాంతంలో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమలలోని గోగర్భం, పాపవినాశం జలాశయాల గేట్లు ఎత్తివేశారు. వర్షాభావ ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మరోవైపు.. తుపాను నుంచి చెన్నై కాస్త తేరుకుంది. మంగళవారం ఉదయం వర్షం పడలేదు. రేపూ వర్షం పడకపోవచ్చనే వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడొచ్చిన తెలిపింది. చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు పునరుద్ధరించారు.