కరోనా వైరస్.. ఆ మద్యం అమ్మకాలు మటాష్

కరోనా వైరస్.. ఆ మద్యం అమ్మకాలు మటాష్

కొన్ని కొన్ని విషయాలు భలే చిత్రంగా అనిపిస్తాయ్. ఎవరో చేసిన పనికి మరెవరో ఫలితం అనుభవించాల్సి వస్తుంది. తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం వారికి ఎన్నెన్నో చికాకులు తెప్పిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎబోలా, నిఫా వైరస్ ల మాదిరిగా ప్రస్తుతం కరోనా బెంబేలెత్తిస్తోంది.

చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి నెమ్మది నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే చైనాలో వేలమందికి సోకి వందల మందిని బలి తీసుకున్న ఈ ప్రాణాంతక వైరస్ పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. దీంతో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అని ఆ వైరస్ కు పేరు ఎలా వచ్చిందో పక్కన పెడితే.. ఇప్పుడు ఆ పేరు ఓ బీర్ల కంపెనీ భవిషత్తును ప్రమాదంలో పడేసింది.

మన దేశంలో లోకల్ బ్రాండ్లకు తోడు బోలెడు విదేశీ బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంది. అలాంటి విదేశీ బ్రాండ్లలో కరోనా ఒకటి. ప్రస్తుతం అదే ఆ కంపెనీకి ఇబ్బందిగా మారింది. పేరులో కరోనా ఉండటంతో.. ఆ మద్యం తాగితే తమకు కూడా కరోనా వైరస్ వస్తుందనే అపోహ మందుబాబుల్లో ఏర్పడింది. దీంతో వారు ఆ మద్యం అంటేనే హడలిపోతున్నారు.

మొన్నటివరకు బాగానే అమ్ముడైన కరోనా బ్రాండ్ మద్యం సీసాలు.. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. కరోనా వైరస్ కు ఈ పేరుకు సంబంధం లేకుపోయినా, వారిలో ఉన్న అపోహలు ఈ మద్యం కంపెనీకి శాపంలా పరిణమించాయి.

గతంలో చికెన్ గున్యా వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. వాస్తవానికి దోమకాటు ద్వారా చికెన్ గున్యా వస్తుంది. కానీ చికెన్ తినడం వల్లే చికన్ గున్యా వస్తుందని జనం భయపడ్డారు. దీంతో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో జనంలో ఉన్న అపోహలను తొలగించడానికి పౌల్ట్రీ సంఘాలు ఉచితంగా చికెన్ పంపిణీ చేసి, జనంలో అపోహలు పోగొట్టి, అసలు విషయం ఏమిటో వివరించారు.

ప్రస్తుతం కరోనా మద్యం కంపెనీ పరిస్థితి కూడా అలాగే ఉండటంతో అది కూడా ఉచితంగా మద్యం పంపిణీ చేస్తుందేమో చూడాలి.