నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక సందర్భంలో నర్సుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన వ్యాఖ్యలతో నర్సుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఒక వర్గం వారు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
కొందరు ఏకంగా బాలకృష్ణ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పలు సంఘాల వారు ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, నర్సులు అంటే తనకు గౌరవమని.. తన మాటలను వక్రీకరించారంటూ బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. తన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ ఇవ్వడంతో కాస్త సోషల్ మీడియాలో హడావుడి తగ్గినట్లుంది.
ఫేస్ బుక్ ద్వారా బాలకృష్ణ ఈ వివాదంపై స్పందిస్తూ…
అందరికి నమస్కారం,
నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను …
నా మాటలను కావాలనే వక్రీకరించారు
రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ…
మీ నందమూరి బాలకృష్ణ