ఆ పెద్దాయనకి నిద్దరొచ్చింది.! రోజులో ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సేవ చేసేసే ఆయనగారికి, అసెంబ్లీ సమావేశాల సమయంలో నిద్దరొస్తే తప్పేంటి.? ఆయన్ని 2019 ఎన్నికల సమయంలో జెయింట్ కిల్లర్‌గా అభివర్ణించారు కాబట్టే, ఇంత రచ్చ.! గాజువాక ఎమ్మెల్యే ‘నిద్ర’ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు. తన నియోజకవర్గానికి సంబంధించి కీలకమైన అంశాలపై చర్చకు పెట్టాల్సిన ఎమ్మెల్యే, నాకేంటి సంబంధం.? అనుకుంటూ నిద్దరోయారు.! ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయికూర్చుంది.
చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు నిద్దరోవడం కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే, నిద్రపోవడానికే చట్ట సభలకు వెళతారు ప్రజా ప్రతినిథులు.. అన్న విమర్శ ఎప్పటినుంచో వుంది. చట్ట సభల నిర్వహణ అంటే, కోట్ల రూపాయల ఖర్చు. అదంతా ప్రజాధనమే. కానీ, ఇంత ఖర్చు చేసి చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు ఏం చేస్తారు.? ఇంకేం చేస్తారు.. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు.. అలసి సొలసి, నిద్దరోతారు.!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న అదికార – ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య కొట్లాట జరిగింది. 150కి పైగా ఎమ్మెల్యేలు ఓ వైపు.. పట్టుమని పాతిక మంది కూడా లేని ఎమ్మెల్యేలు ఇంకో వైపు. ఎవరు ఎవరి మీద దాడి చేసి వుంటారు.? జనానికి అన్నీ అర్థమవుతున్నాయ్. పొలిటికల్ యాగీ మాత్రం ఇంకో కోణంలో జరుగుతోంది.
ఇంత గలాటా అసెంబ్లీలో జరిగితే, ఎమ్మెల్యే నిద్రపోవడంపై ఎందుకింత రచ్చ.? ఆయన 2019 ఎన్నికల్లో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఓడించారాయె. ఓడిపోయిన పవన్ కళ్యాణ్, జనం కోసం కోట్లాది రూపాయల సొంత సొమ్ముని ఖర్చు చేస్తోంటే, గెలిచిన ఎమ్మెల్యే.. అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోతున్నారు.
ప్రజలు మారాలి.. ఎవర్ని చట్ట సభలకు పంపిస్తున్నామన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి.!