ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రుల “సామాజిక న్యాయ భేరి” బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న 17 మంది మంత్రులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి ఏపీ నాంది పలికిందని.. ఈక్రమంలో దేశంలో మార్పునకు సీఎం జగన్ ఆద్యుడయ్యారని అన్నారు. బలహీనవర్గాలు పాలితులుగా కాకుండా పాలకులుగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.
బాదుడే బాడుడు అని బాబు తిరిగినా.. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 82 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..? అని ప్రశ్నించారు. పంచిపెడుతున్నారని హేళనగా మాట్లాడుతున్న కొందరి తీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కించపరిచినట్లే భావిస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి సీఎం జగన్ కే ఉందని రాష్ట్రమంతా తిరిగి చెప్పదలచుకున్నామన్నారు.