ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై నిజాన్ని కుండబద్దలుగొట్టేసినట్టు చెప్పాడు ఆ సినీ కవి.
మరి, అల్లూరి సీతారామరాజుని ఎలా చూస్తున్నాం మనం.? అల్లూరి విగ్రహం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయ్.? అల్లూరి విగ్రహానికి పూల దండలు వేస్తే ఎన్ని ఓట్లు వస్తాయ్.? అని రాజకీయ నాయకులు లెక్కలేసుకుంటున్న ఈ రోజుల్లో, అల్లూరి సీతారామరాజు పేరుతో నడుస్తున్నది రాజకీయం కాక మరేమిటి.?
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు, విగ్రహావిష్కర చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతా బాగానే వుంది. ఇంతకీ, ఇలా వచ్చినవాళ్ళలో ఎంతమంది అల్లూరి స్ఫూర్తిని గౌరవిస్తున్నట్టు.?
అల్లూరి సీతారామరాజు ప్రశ్నించారు, పోరాటం చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలర్పించారు కూడా. అదీ చాలా చిన్న వయసులోనే. అలా ఇప్పుడెవరైనా ప్రశ్నిస్తోంటే, పాలకులు సహిస్తున్నారా.? కేసులు పెట్టి లోపలేస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు చేసింది అదే కదా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంటుంది.
ప్రశ్నించడమే నేరంగా మారిపోయిన ఈ సమాజంలో.. అసలు అల్లూరి స్ఫూర్తి ఎక్కడుంది.? ఆ స్ఫూర్తిని గౌరవించలేనప్పుడు, విగ్రహం పేరుతో ఇంతటి రాజకీయమెందుకు.?
మహాత్మా మన్నించు.. అంటూ గాంధీ జయంతికీ, వర్ధంతికీ అనుకుంటుంటాం. ఇప్పుడు అల్లూరీ క్షమించు.. అనాలేమో.! ఏ గిరిజినుల హక్కుల కోసం అల్లూరి పోరాడారో, ఇప్పటికీ ఆ గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తూనే వుంది.
కానీ, అల్లూరి విగ్రహానికి మాత్రం జయంతికీ, వర్ధంతికీ పూలమాలలు పడిపోతున్నాయ్. ఇదీ నేటి రాజకీయం.!